Site icon vidhaatha

UP | పద్నాలుగేళ్ల కూతుర్ని చంపిన యూపీ దంపతులు


లక్నో : తమ పద్నాలుగేళ్ల కుమార్తెను చంపి, ఆ హత్యను పొరుగింటివారు చేశారని వారిని ఇరికించేందుకు ప్రయత్నించిన భార్యాభర్తలను పోలీసులు అరెస్టు చేశారు. యూపీలోని మైన్‌పురికి చెందిన దంపతులు తమ కుమార్తె శివానీ అలియాస్‌ జాన్వీని గత ఏడాది అక్టోబర్‌ 29న గొంతు పిసికి చంపారు. తాము వద్దని హెచ్చరించినా స్థానిక యువకుడితో మాట్లాడుతున్నదనే కోపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.


ఈ కేసులో మృతురాలి తండ్రి కృష్ణపాల్‌ (48), తల్లి సుధా అలియాస్‌ గుడ్డిదేవి(43), వారి బంధువులు ఆంట్‌ బేబీ (26), అఖిలేశ్‌ (38), రజనీశ్‌ (36)లను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణపాల్‌ హిస్టరీ షీటర్‌ అని, ఆయనపై 25 క్రిమినల్‌ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అఖిలేశ్‌, రజనీశ్‌పైనా చెరొక కేసు ఉన్నాయని చెప్పారు.


ఎటా జిల్లాలో మృతదేహం


గత ఏడాది అక్టోబర్‌ 30వ తేదీన ఎటా జిల్లా మలావన్‌ ఏరియాలో నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిలో మెడ చుట్టూ గాయాలు ఉన్న ఒక బాలిక మృతదేహం కనిపించింది. ఈ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు.. పొరుగునే ఉన్న మైన్‌పురి జిల్లా నాగ్లా హర్కేశ్‌ గ్రామంలో ఒక బాలిక కనిపించకుండా పోయిందని గుర్తించారు. మృతురాలి కుటుంబీకులు ఎటాకు వచ్చి, అది తమ కుమార్తె శివాని అని చెప్పారు.


ఈ ఘటనలో తమకు పొరుగున ఉండే, గతంలో కుటుంబ గొడవలు ఉన్న దినేశ్‌ యాదవ్‌, విశేష్‌ యాదవ్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పని మీద బయటకు వచ్చిన తమ కుమార్తను ఈ ఇద్దరూ కిడ్నాప్‌ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెను వారిద్దరూ చంపి, మృతదేహాన్ని వారి గ్రామానికి 55 కిలోమీటర్ల దూరంలోని ఎటాలో పడేశారని ఆరోపించారు. అనంతరం దర్యాప్తును ఎటా నుంచి మైన్‌పురికి బదిలీ చేశారు.


యువకుడితో మాట్లాడుతున్నదని..


శివాని స్థానికంగా ఒక యువకుడితో మాట్లాడుతూ ఉండేదని మైన్‌పురిలోని బిచ్చావన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో అవ్నిశ్‌ త్యాగి చెప్పారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన శివాని తల్లిదండ్రులు.. అతడితో సంబంధాన్ని మానుకోవాలని వార్నింగ్‌ ఇచ్చారని, పలుమార్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా కొట్టారని తెలిపారు. శివాని మృతదేహం ఎటాలో బయటపడిన రోజు కృష్ణపాల్‌ ఇంటి వద్ద ఒక వాహనం చక్కర్లు కొట్టినట్టు గుర్తించామని స్థానికులు పోలీసులకు వెల్లడించారు.


మృతదేహం కనిపించిన రోజు శివాని బంధువుల జీపీఎస్‌ లొకేషన్‌ కూడా వారు ఎటాలో తిరిగినట్టు తేల్చింది. దీంతో తల్లిదండ్రులను ఇంటరాగేట్‌ చేయగా.. తమ నేరాన్ని ఒప్పుకొననారని త్యాగి తెలిపారు. స్థానిక యువకుడితో సంబంధం కలిగి ఉండటం సమాజంలో తమకు అప్రదిష్ట తెస్తుందని భావించామన్నారని చెప్పారు. గత ఏడాది అక్టోబర్‌ 29వ తేదీన ఈ విషయమై ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని, మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆమె గొంతును స్కార్ఫ్‌తో బిగించి, ఊపిరాడకుండా చేయడంతో ఆమె చనిపోయిందని త్యాగి తెలిపారు.


కారులో మృతదేహాన్ని తీసుకుని..


‘శివాని చనిపోవడంతో అఖిలేశ్‌కు ఫోన్‌ చేసి, కారు తీసుకురావాలని చెప్పాడు. రజనీశ్‌ను కూడా రావాలని కోరాడు. ఈ ముగ్గురూ మృతదేహాన్ని కారులో వేసుకుని, ఎటాలోని మలావాన్‌ ఏరియాకు తీసుకెళ్లి, అక్కడ మృతదేహాన్ని పడేశారు’ అని మైన్‌పురి ఎస్పీ వినోద్‌ కుమార్‌ వివరించారు. ఈ ఉదంతంలో పోలీసు బృందం శ్రమించి, అసలైన నిందితులను పట్టకున్నదంటూ అభినందించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న దినేశ్‌, విశేష్‌లకు క్లీన్‌ చిట్‌ ఇచ్చి పంపించేశారు.

Exit mobile version