Site icon vidhaatha

మేనల్లుడికి మళ్లీ పట్టంగట్టిన మాయావతి … పార్టీ జాతీయ కోఆర్డినేటర్‌గా అకాశ్‌ ఆనంద్‌

లక్నో: అందరూ ఊహించినట్టుగానే తన మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌ను తన వారసుడిగా బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఆదివారం ప్రకటించారు. అతడిని పార్టీ జాతీయ కోఆర్డినేటర్‌గా నియమించారు. కొద్ది నెలల క్రితమే అతడిని ఆ పోస్టు నుంచి తొలగించిన మాయావతి.. తిరిగి ఆయనకు పట్టంగట్టారు. లక్నోలో నిర్వహించిన పార్టీ జాతీయ స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ‘పూర్తి పరిపక్వతతో పార్టీకోసం పనిచేసేందుకు ఆకాశ్‌ ఆనంద్‌కు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి మరోసారి అవకాశం ఇచ్చారు. ఇంతకు ముందు పార్టీలో ఆయనకు ఉన్న అన్ని పదవుల్లో ఆయన కొనసాగుతారు’ అని బీఎస్పీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయనే మాయావతి వారసుడిగా ఉంటారని, పార్టీ జాతీయ కోఆర్డినేటర్‌గా కొనసాగుతారని పేర్కొన్నది.

మాయావతి విడిగా వేరొక ప్రకటన చేస్తూ.. పార్టీ, ఉద్యమం కోసం మరింత పరిపక్వత కలిగిన నేతగా ఆకాశ్‌ ఎదుగుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ కోఆర్డినేటర్‌గా గత ఏడాది డిసెంబర్‌లో ఆకాశ్‌ ఆనంద్‌ను మాయావతి ఎంపిక చేశారు. కానీ.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. లోక్‌సభ ఎన్నికల వేళ మే 7వ తేదీన ఆయనను ఆ పదవి నుంచి తప్పించారు. ఆయనకు పరిపక్వత వచ్చే వరకూ ఆ పదవి నుంచి తప్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఏప్రిల్‌ 28వ తేదీన ఎన్నికల ప్రచారంలో అభ్యంతరకర పదజాలాన్ని వాడారంటూ ఆయనపై ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసు పెట్టింది.

Exit mobile version