UPI Services: దేశంలో ఆన్ లైన్ బ్యాంకింగ్ (Online banking) సేవలు శనివారం మరోసారి స్తంభించాయి. దేశ వ్యాప్తంగా యూపీఐ(UPI) ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌లు గంటల తరబడి పనిచేయలేదు. దీంతో లావాదేవిలు సాగక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యూపీఐ సేవల అంతరాయం పట్ల సోషల్ మీడియా వేదికగా వినియోగదారులు అసహనం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం వరకు పరిస్థితి మెరుగుపడకపోవడంతో వ్యాపార, వాణిజ్య చెల్లింపుల సందర్భంగా యూపీఐ వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. ఫోన్ పే, గూగుల్ పే వంటి చెల్లింపులు ఫెయిల్ కావడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల 26వ తేదీన ఇలాంటి పరిస్థితి తలెత్తగా… సాంకేతిక కారణంతో ఇలా జరిగిందని ఎన్‌పీసీఐ అప్పట్లో వివరణ ఇచ్చింది. ఆ తర్వాత ఈ నెల 2న కూడా యూపీఐ సేవలకు కొంతసేపు అంతరాయం కలిగింది. రోజుల వ్యవధిలో తాజాగా మరోసారి యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో ఆటంకం ఏర్పడింది.
డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడిన ప్రజలు
నోట్ల రద్దు, కరోనా పరిస్థితుల సందర్భాలతో పాటు ప్రధాని మోదీ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంతో దేశంలో ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు కీలకంగా మారాయి. ప్రతి రోజు వేల కోట్ల రూపాయల ట్రాన్సక్షన్స్ యూపీఏ పద్ధతిలో మొబైల్ ఫోన్లతో జరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్ ల ద్వారా యూపీఐ పేమెంట్ చేస్తున్నారు. రూపాయి నుంచి లక్షల రూపాయల వరకు యూపీఐ పేమెంట్స్ ద్వారా జరుగుతుండటంతో ప్రజలు కరెన్సీ నోట్ల వినియోగం అలవాటుకు దూరమయ్యారు. ఈ పరిస్థితులో దేశ వ్యాప్తంగా అకస్మాత్తుగా గంటల తరబడి యూపీఐ సేవలు పనిచేయకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో రోజంతా లేక కొన్ని రోజులు ఎదురైనా..సైబర్ అటాక్ వంటి వాటితో ఇబ్బందులు ఏర్పడినా..ఇప్పటికే డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడక తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.