విధాత: జపాన్ (Japan) లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ సైనిక విధుల్లో ఉన్న అమెరికన్ (America) సైన్యానికి చెందిన హెలికాప్టర్ ఒకటి కుప్పకూలిపోయింది. ప్రమాదం (Helicopter Crash) జరిగిన సమయంలో హెలకాప్టర్‌లో 8 మంది ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జపాన్ తీర ప్రాంతమైన యుకుషిమా ద్వీపంలో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. కూలిపోయిన హెలికాప్టర్‌ను ఓస్ప్రే శ్రేణికి చెందినదిగా అధికారులు గుర్తించారు.
అయితే ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారు.. ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా అన్న అంశాలపై గోప్యత పాటిస్తున్నారు. ఇవాకునీ అనే ప్రాంతంలో ఉన్న అమెరికా ఆర్మీ బేస్ నుంచి టేకాఫ్ అయ్యి కడేనా బేస్‌కు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని జపాన్ జాతీయ వార్తా సంస్థ ఎన్‌హెచ్‌కే పేర్కొంది. ప్రమాదానికి గురైన సీఎస్-22 ఓస్ప్రే యూఎస్ యెకోటా ఎయిర్ బేస్‌కు సేవలందిస్తుంది.
అయితే చరిత్రను చూసుకుంటే ఓస్ప్రే శ్రేణి హెలికాప్టర్‌లు అంత నమ్మదగినవి కాదని.. ఇవి ఎన్నో ప్రమాదాలకు కారణమయ్యాయని భద్రతా నిపుణులు చెబుతున్నారు. గత ఆగస్టులో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రమాదంలో ఈ హెలికాప్టర్ కూలిపోయి.. ముగ్గురు యూఎస్ మెరైన్లు ప్రాణాలు కోల్పోయారు. 2017లో ఆస్ట్రేలియాలోనే జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు సిబ్బంది కన్నుమూశారు.
2000లో అరిజోనాలో జరిగిన ఓస్ప్రే హెలికాప్టర్ ప్రమాదంలో 19 మంది బలయ్యారు. ఇదే నెలలో మధ్యధరా సముద్రంలో హెలికాప్టర్ కూలిపోయి అయిదుగురు యూఎస్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇది ఏ మోడల్ హెలికాప్టర్ అనేది అధికారులు బయటపెట్టలేదు. ఆ హెలికాప్టర్ కూడా ఓస్ప్రే శ్రేణికి చెందినదే అయి ఉంటుందని అంచనాలున్నాయి.