USA |
విధాత: తన భార్య 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకోనున్న సందర్భంగా అమెరికా (America) లోని ఓ వ్యక్తి భార్యకు మరిచిపోలేని బహుమతి ఇవ్వాలనుకున్నాడు. తనకి ఏమి ఇష్టమో గుర్తుచేసుకుంటే.. పొద్దుతిరుగుడు పువ్వు (Sun Flower) లంటే మహా ఇష్టమని గుర్తొచ్చింది. అంతే ఒక 80 ఎకరాల పొలం తీసుకుని అటు నుంచి ఇటు వైపునకు మొత్తం పొద్దు తిరుగుడు తోట వేసేశాడు.
ఒకటీ రెండు కాదు ఏకంగా 15 లక్షల పొద్దు తిరుగుడు మొక్కలను పెంచాడు. కాన్సస్‌కు చెందిన విల్సన్ ఓ రైతు. తన భార్య రీనే. ఇద్దరూ హైస్కూల్‌లోనే ప్రేమించుకుని తర్వాత వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఈ నెల 10న వీరి 50వ వివాహ వార్షికోత్సవ వేడుక జరగనుంది. ఆ వేడుకలో తన భార్యకు బహుమతిగా ఈ 15 లక్షల పొద్దుతిరుగుడు మొక్కలను చూపించనున్నాడు.
మేలో విత్తనాలు జల్లి సాగు ప్రారంభించగా ఎకరానికి వేల చొప్పున పొద్దు తిరుగుడు మొక్కలను పెంచామని విల్సన్ వెల్లడించారు. ఈ 80 ఎకరాలను పండించడానికి అతడి కుమారుడి సాయం తీసుకున్నాడు. ఇంత పెద్ద పొలంలో పనిచేస్తున్నా వారిద్దరూ రీనేకు ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డారు.
ఇటీవలే రెండు రోజుల క్రితం తన భార్య రీనేను పొలానికి తీసుకొచ్చి విల్సన్ సర్‌ప్రైజ్ చేశాడు. తొలుత దీనిని నమ్మలేక పోయిన రీనే.. తర్వాత తన భర్తను కౌగిలించుకుని ఆనందాన్ని పంచుకుంది. ఇంత కన్నా మంచి గిఫ్ట్ ఇంకేదీ ఉండదని చెప్పుకొచ్చింది. అతడి ప్రయత్నం.. దాని వెనుక ఉద్దేశం చుట్టుపక్కల బాగా ప్రచారం కావడంతో ఆ 80 ఎకరాల పూల తోటను చూడటానికి సందర్శకులు క్యూ కడుతున్నారు.
పొద్దు తిరుగుడు పూలు దక్షిణ, ఉత్తర అమెరికా ఖండాలకు చెందినవి. ఈ పువ్వులు పెద్దగా విచ్చుకున్న మోములా ఉండటంతో వీటిని ఆభరణాలుగా ధరించడం అక్కడి ప్రజలకు ఒక అలవాటు. సుమారు 1నుంచి 4.5 మీటర్ల ఎత్తు వరకు ఈ మొక్కలు పెరిగి.. చూడటానికి అందంగా ఉంటాయి.