విధాత: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్లు బహిరంగ విమర్శలు చేయడం వెనక ఎంపీ ఎన్.ఉత్తంకుమార్ రెడ్డి కుట్ర దాగి ఉందని మాజీ ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ విమర్శించారు. రేవంత్ కు వ్యతిరేకంగా మాట్లాడిన సీనియర్ల విమర్శలకు అనిల్ కుమార్ కౌంటర్ తో కాంగ్రెస్ లో చెలరేగిన తాజా సంక్షోభం మరింత ముదిరింది.
హైదరాబాదులో ఆదివారం మీడియాతో మాట్లాడిన అనిల్ ఇంతకాలం కాంగ్రెస్ లో ముసుగు వీరుడిగా ఉన్న ఉత్తమ్ ఇప్పుడు రేవంత్ కు వ్యతిరేకంగా బయటపడి సేవ్ కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. అసలు ఉత్తంకుమార్ రెడ్డి తీరుతోనే కాంగ్రెస్ నాశనం అవుతుందని దుయ్యబట్టారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి లోపాయికారిగా పనిచేసిన ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజంగానే కోవర్టులంటూ అనిల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఉత్తంకుమార్ రెడ్డి కింద కాంగ్రెస్ సీనియర్లు పనిచేసి నష్టపోవద్దంటూ అనిల్ కోరారు.
పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు ఉత్తంకుమార్ రెడ్డి బీసీలకు టికెట్లు ఇవ్వకుండా అణచివేశారని, పొన్నాలకు టికెట్ రాకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు. ఉత్తమ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తమ స్వార్థం కోసం టిడిపి తో పొత్తు పెట్టుకున్నారని, దీంతో ఎంతో మంది కాంగ్రెస్ వాదులకు ఎన్నికల్లో పొత్తుల కారణంగా టికెట్లు దక్కక నష్టపోయారన్నారు.
అప్పుడు ఉత్తమ్‌కు సేవ్ కాంగ్రెస్ ఎందుకు గుర్తుకు రాలేదంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు టిడిపి నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం పట్ల అభ్యంతరం ఎందుకు అంటూ అనిల్ ప్రశ్నించారు. ఒకే ఏడాది కాంగ్రెస్ నుండి ఉత్తమ్ కుటుంబం 4 బీ ఫామ్ లు పొందిన విషయం మరువరాదన్నారు.
పొత్తులలో భాగంగా ఆనాడు టిడిపి నుండి, కాంగ్రెస్ హై కమాండ్ నుండి వచ్చిన డబ్బులు ఎవరెవరికి ఏమిచ్చారన్న దానిపై లెక్కలు లేవన్నారు. కాంగ్రెస్ కోశాధికారిగా ఉన్న గూడూరు నారాయణరెడ్డిని ఎక్కడ పార్టీ లెక్కలు చెప్పాల్సి వస్తుందన్న భయంతో బిజెపిలోకి ఉత్తంకుమార్ రెడ్డినే పంపించారన్నారు.
పాడి కౌశిక్ రెడ్డిని కూడా టిఆర్ఎస్ లోకి పంపించింది ఉత్తంకుమార్ రెడ్డినే అని అనిల్ ఆరోపించారు. ఉత్తమ్ టిపిసిసి చీఫ్ గా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 12 మంది టిఆర్ఎస్‌లో చేరిపోయిన సంగతి వాస్తవం కాదా అంటూ అని నిలదీశారు. కేవలం దళితుడైన బట్టిని సీఎల్పీ నేతగా నియమించినందున కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరుతున్నా ఉత్తమ మౌనంగా ఉన్నారని ధ్వజమెత్తారు..
తాను ఆశించిన సీఎల్పీ నేత పదవి దక్కనందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను ఉత్తమ ప్రోత్సహించారని ఆరోపించారు. సేవ్ కాంగ్రెస్ అంటున్న సీనియర్లకు కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్ పై పోలీసులు దాడి చేస్తుంటే.. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా సేవ్ కాంగ్రెస్ ఎందుకు గుర్తుకు రాలేదని అప్పుడు సీనియర్లు ఎక్కడ పోయారు అంటూ మండిపడ్డారు. తాను ఆరోపించిన అంశాల్లో వాస్తవాలు లేకుంటే ఏ గుడిలోనైనా ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని ఉత్తమ్ కూడా అందుకు సిద్ధమేనా అంటూ సవాల్ చేశారు.
కాగా కాంగ్రెస్ సీనియర్లు భట్టి, ఉత్తమ్, దామోదరం రాజనర్సింహ, జగ్గారెడ్డి, మధుయాష్కీలు రేవంత్ కు వ్యతిరేకంగా బహిరంగంగా అసమ్మతి వెళ్లగక్కిన నేపథ్యంలో ఆయన అనుచరుడుగా ఉన్న అనిల్ ఉత్తమ్ టార్గెట్ గా సీనియర్లపై ప్రతి విమర్శలకు దిగడంతో కాంగ్రెస్‌లో రేవంత్ అనుకూల.. వ్యతిరేక వర్గాల మధ్య వివాదం మరింత ముదిరినట్లు అయింది.
సమావేశానికి రకపోతే హై కమాండ్ ను ధిక్కరించినట్లే: మల్లు రవి
మరోవైపు ఈ ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ పీఏసీ, పిసిసి సమావేశాలకు కాంగ్రెస్ సీనియర్లు వస్తారని ఆశిస్తున్నామని నూతన కమిటీల పై వారు చేసిన విమర్శల్లో వాస్తవం లేదని మరో సీనియర్ నేత మల్లు రవి అన్నారు. సీనియర్లు రేవంత్‌కు వ్యతిరేకంగా బహిరంగంగా వ్యాఖ్యానించడం సరికాదని వారు ఈరోజు పిఎసి, పీసీసీ సమావేశాలకు రాకుంటే పార్టీ హైకమాండ్ ను ధిక్కరించినట్లుగా భావించవలసి వస్తుందంటూ మల్లు రవి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ లో నెలకొన్న రేవంత్, సీనియర్ల పోరు ఎంత దూరం వెళ్తుందో నన్న ఆందోళన కేడర్లో వ్యక్తం అవుతుంది. ఇంకోవైపు ఈ వచ్చే నెలాఖరు నుండి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తారన్న నేపథ్యంలో అసలు కాంగ్రెస్ సీనియర్లు వైఖరి ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.