క్యాన్సర్, గుండెజబ్బుల నివారణకు వ్యాక్సిన్ (vaccines for cancer and heart disease) కనుగొనే ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఈ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే.. కోట్లమందికి ఉపశమనం లభిస్తుంది.
విధాత : ఐదేళ్ల వ్యవధిలో తిరుగులేని చికిత్సలు అందిస్తామని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ మోడెర్నాలోని శాస్త్రవేత్తలు విశ్వాసంతో చెబుతున్నారు. కొవిడ్‌కు వ్యాక్సిన్ తయారు చేయడంలో సాధించిన విజయం.. కొన్ని స్వయంప్రతిరక్షక వ్యాధులకు వ్యాక్సిన్‌లు తయారు చేసే ప్రక్రియ వేగాన్ని పెంచేందుకు ఉపకరించిందని, 15 ఏళ్లు పట్టే సమయం.. ఇప్పడు 12 నుంచి 18 నెలలకు తగ్గిపోయిందని పేర్కొంటున్నారు.
అన్ని క్యాన్సర్లకూ వ్యాక్సిన్లు
వివిధ రకాల క్యాన్సర్లను ఎదుర్కొనేలా వ్యాక్సిన్లను తాము అభివృద్ధి చేస్తున్నామని కొవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసిన మోడెర్నా కంపెనీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పౌల్ బర్టన్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు రకాల ట్యూమర్‌లతో బాధపడే క్యాన్సర్ రోగులకు వారికి అవసరమైన వ్యాక్సిన్లు అందించగలుగుతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
అరుదైన వ్యాధులకూ చికిత్స
గతంలో మందులు లేని అరుదైన వ్యాధులకు సైతం ఎంఆర్‌ఎన్‌ఏ చికిత్సలు అందుబాటులోకి వస్తాయని డాక్టర్ బర్టన్ తెలిపారు. ఆ సమయానికి ఒకే ఒక్క ఇంజక్షన్‌తో అనేక రకాల శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయవచ్చని చెప్పారు.
జన్యుకారణాన్ని కనుగొంటే..
రోగానికి కారణమవుతున్న జన్యుకారణాన్ని కూడా గుర్తించే దిశగా తమ ప్రయత్నాలు ఉన్నాయని, ఇవి పదేళ్లలో సాకారం అవుతాయని భావిస్తున్నామని డాక్టర్ బర్టన్ తెలిపారు. జన్యుకారణాన్ని గుర్తించగలిగితే.. ఎంఆర్‌ఎన్‌ఏ ఆధారిత సాంకేతికతను ఉపయోగించి సమస్య వద్దకు వెళ్లి.. దాన్ని సరిదిద్దడం లేదా మరమ్మతు చేయడం సాధ్యమవుతుందని అన్నారు.
ఎంఆర్‌ఎన్‌ఏ చికిత్సలు అన్నింటికీ
ఇన్ఫెక్షన్ల ద్వారా వ్యాపించే వ్యాధులు లేదా కొవిడ్ వంటి వాటికి మాత్రమే ఎంఆర్‌ఎన్‌ఏ చికిత్స అనేది తప్పని ఇటీవలి తమ అధ్యయనాల్లో వెల్లడైందని తెలిపారు. ఇన్ఫెక్షన్ల ద్వారా కలిగే రోగాలతోపాటు.. క్యాన్సర్లు, హృదయ సంబంధ జబ్బులు, స్వయంప్రతిరక్షక వ్యాధులు, అరుదైన వ్యాధులకు కూడా ఇదే సూత్రాన్ని వర్తింప చేయవచ్చని ఆయన వివరించారు. అన్ని రంగాల్లో తాము అధ్యయనాలు చేశామని, అద్భుతమైన విశ్వసం కలిగిందని బర్టన్ చెప్పారు