Vanajeevi Ramaiah: పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి దరిపల్లి రామయ్య(85) కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన మృతి చెందారు. వనజీవి రామయ్య స్వగ్రామం ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి. తన జీవిత కాలంలో కోటికి పైగా మొక్కలు నాటి ఆయన సరికొత్త చరిత్రను సృష్టించారు. 2017లో ఆయన పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. రోడ్ల పక్కన, పాఠశాలలు, ఆసుపత్రులు, దేవాలయాల్లో వనజీవి రామయ్య మొక్కలు నాటేవారు. వృక్షో రక్షతి రక్షితః అంటూ ఆయన నిత్యం ప్రచారం చేసేవారు. మొక్కల ప్రేమికుడు రామయ్య, ఇంటిపేరునే వనజీవిగా మార్చుకున్నారు. జీవితమంతా మొక్కలు నాటి పెంచారు.
వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ సంతాపం
పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి పద్మశ్రీ రామయ్య అని తెలిపారు. రామయ్య మరణం సమాజానికి తీరని లోటు అని, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. పర్యావరణ రక్షణకు పాటుపడుతూ తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య ఆత్మకు నివాళిని సీఎం అర్పించారు. రామయ్య సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శమని చెప్పుకొచ్చారు.
తీవ్ర విచారానికి లోనయ్యా: ఏపీ సీఎం చంద్రబాబు
వనజీవి రామయ్య మృతి వార్త తెలిసి తీవ్ర విచారానికి లోనైనట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. పచ్చదనం ప్రాధాన్యత చెప్పిన రామయ్య నేటితరానికి ఆదర్శమని చెప్పారు. ఆయన మరణం పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.