- ఈనెల 30న సీతారాముల కల్యాణోత్సవం..
- లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో పంచాంగ శ్రవణం
విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండ పైన అనుబంధ ఆలయం శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి శివాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వసంత నవరాత్రి మహోత్సవాలు శైవాగమ పద్ధతిలో శోభకృత్ సంవత్సర చైత్ర శుద్ధ పాండ్య రోజున ఘనంగా ఆరంభించారు.
చైత్ర శుద్ధ ద్వాదశి ఏప్రిల్ రెండు వరకు వసంతోత్సవాలు కొనసాగనున్నాయి. ఆలయ పునర్నిర్మాణం కారణంగా ఆరేళ్లుగా తాత్కాలిక ఉపాలయంలో కొనసాగిన వసంత నవరాత్రి మహోత్సవాలు గత ఏప్రిల్ 25న జరిగిన శివాలయం ఉద్ఘటన సందర్భంగా శివాలయం ఈశాన్య ప్రాకారములో సీతారామచంద్రస్వామి విగ్రహం ప్రతిష్టించారు. ఏటా శ్రీరామనవమి సందర్భంగా వసంత నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం అనవాయితీ.
వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 29వ తేదీ బుధవారం రాత్రి సీతారామచంద్ర స్వామి వారి ఎదుర్కోలు మహోత్సవం, 30వ తేదీ గురువారం మధ్యాహ్నం సీతారాముల కల్యాణోత్సవం శివాలయం బాహ్య ప్రాకారములోని కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు. 31వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం సీతారాముల పట్టాభిషేకం మహోత్సవం, ఏప్రిల్ 1వ తేదీ శనివారం మధ్యాహ్నం సత్యనారాయణ స్వామి వ్రతం, 2వ తేదీ ఆదివారం శివాలయంలో సీతారాంచంద్ర స్వామికి నిత్య పూజలు నిర్వహించడంతో ఉత్సవాలు ముగుస్తాయి.
ఉత్సవాల సందర్భంగా శివాలయ యాగశాలలో శ్రీసీతారామచంద్ర ఉత్సవమూర్తులకు నిత్య పూజలు నిర్వహిస్తారు. కాగా శోభకృత్ సంవత్సర ఉగాది వేడుకల సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు.