Vasant Panchami | పంటలు ప్రారంభం.. చదువు ఆరంభం.. వసంతాన్ని స్వాగతించే రోజే వసంత పంచమి..!

‘సరస్వతీ నమస్తుభ్యం..వరదే కామరూపిణీం..విద్యారంభం కారిష్యామి.. సిద్ధిర్భవతుమే సదా’ అంటూ సరస్వతీ మాతకు నమస్కరించి విద్యా సంవత్సరాన్ని మొదలుపెట్టే రోజు.. వసంత రుతువును స్వాగతిస్తూ పండుగ చేసుకునే రోజునే మాఘ శుక్ల పంచమి.

  • Publish Date - February 13, 2024 / 09:14 AM IST

Vasant Panchami | ‘సరస్వతీ నమస్తుభ్యం..వరదే కామరూపిణీం..విద్యారంభం కారిష్యామి.. సిద్ధిర్భవతుమే సదా’ అంటూ సరస్వతీ మాతకు నమస్కరించి విద్యా సంవత్సరాన్ని మొదలుపెట్టే రోజు.. వసంత రుతువును స్వాగతిస్తూ పండుగ చేసుకునే రోజునే మాఘ శుక్ల పంచమి.. వసంత పంచమి.. శ్రీపంచమి అని పిలుస్తారు. జనవరి 26న గురువారం రోజు వసంత పంచమిని ఘనంగా జరుపుకొనేందుకు దేశమంతా సిద్ధమవగా, ఈ పండుగ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..


దేశంలో ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంటుంది. పురాణ, చారిత్రక అంశాలతో మేళవించినవే కాకుండా సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింపజేసే.. ప్రకృతిలో వచ్చే మార్పులు, పంటలు మొదలుపెట్టే.. దిగుబడులు ఇళ్లకు చేరే సందర్భాలను మనం పండుగలా జరుపుకొంటాం.. అలానే మాఘ శుక్ల పంచమినాడు వసంత రుతువును స్వాగతిస్తూ వసంత పంచమిని ఘనంగా నిర్వహించుకుంటాం.


వసంత పంచమి రోజునే సరస్వతీ దేవి జన్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తున్నది. తూర్పు భారత దేశంలో ఈ రోజున సరస్వతీ మాతను కొలుస్తారు. పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. జ్ఞానానికి ఆదిదేవత సరస్వతీమాత. ఆమె జ్ఞానస్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైనవాటిని సరస్వతి అంశలుగా భావిస్తారు. సృజనాత్మక శక్తికి, స్ఫూర్తికి కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెబుతారు.


విద్యారంభదినం


వసంత పంచమి రోజునే విద్యారంభ దినంగా భావించి పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. మన రాష్ట్రంలో బాసర సరస్వతీ మాత ఆలయం, నేటి సిద్ధిపేట జిల్లా శనిగరంలోని అనంత్‌సాగర్‌లో కొలువైన సరస్వతి మాత ఆలయానికి అక్షరాభ్యాసాల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ప్రతి పాఠశాలలోనూ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సామూహిక అక్షరాభ్యాలను పండుగలా చేయిస్తారు.


అహింసకు అధిదేవత వాగ్దేవి


సత్వరజస్తమోగుణాలను బట్టి అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను పార్వతి, లక్ష్మీ, సరస్వతిగా కొలుస్తారు. వీరిలో ఆయుధాలు ఏవీ ధరించని సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తిగా.. అహింసామూర్తిగా.. అహింసకు అధినాయకిగా మనకు కనిపిస్తుంది. వాగ్దేవి అంటే వాక్కును ప్రసాదించే దేవి అని అర్థం. సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉన్నది. ప్రవాహం అంటే చైతన్యానికి ప్రతీక.


ఉత్పాదకత ఆరభం


జలం సకల జీవరాశికి శక్తినిస్తుంది. ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత (పంట పండించడం) వసంతరుతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదక శక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడు, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదే శక్తిదాయిని కాబట్టి వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకం. ఆ రోజునే సరస్వతీ పూజ చేయడం అనాదిగా వస్తున్నది. శ్రీ పంచమి అనీ పిలిచే ఈ పండుగ పరమార్థంలో శ్రీ అంటే సంపద కూడా దాగి ఉంది.


సస్య, ప్రేమ, అనురాగాల ప్రతీక


శ్రీపంచమినే రతికామ దమనోత్సవంగా వ్యవహరిస్తారు. ఈ రోజునే రతీదేవి కామ దేవ పూజ చేసినట్లు ప్రతీతి. రుతురాజు అయిన వసంతుడికి, కామదేవునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వసంతుడు సస్య (పంటలు)దేవత కాగా, కాముడు ప్రేమదేవత. రతీదేవి అనురాగ దేవత. ఈ ముగ్గురినీ వసంత పంచమినాడు పూజించడం వల్ల వ్యక్తుల్లో పరస్పర ప్రేమానురాగాలు పరిఢవిల్లుతాయనే లోకోక్తి కూడా ఉంది.


రుద్రుడి భ్రుకుటి నుంచి ఆవిర్భవించిన జ్ఞానశక్తి


రుద్రుని భ్రుకుటి నుంచి (నుదుట బొట్టు పెట్టుకునే ప్రాంతం) ఆవిర్భవించిన ఈ జ్ఞానశక్తి బ్రహ్మను అనుగ్రహించిందని శాస్త్రాలు చెబుతున్నాయి. తారిణి, తరళ, తార, త్రిరూప, ధరణీరూప, స్తవరూప, మహాసాధ్వి, సర్వసజ్జనపాలిక, రమణీయ, మహామాయ, తత్త్వజ్ఞానపర, అనఘా, సిద్ధలక్ష్మి, బ్రాహ్మణి, భద్రకాళి, ఆనంద.. అనేవి తంత్రశాస్త్రాల ఆధారంగా సరస్వతీ దేవి దివ్యనామాలు.


సరస్వతీ మాతను పూజించే విధానం


పురాణాల ప్రకారం, బ్రహ్మ దేవుని నోటి నుంచి సరస్వతి మాత ఉద్భవించింది. ఈరోజే సరస్వతి మాత దర్శనమిచ్చి, ఈ లోకానికి శబ్దాన్నిచ్చింది. వసంత రుతువు ప్రారంభంలో ఆహ్లాదకరమైన వాతావరణం ప్రారంభమవడంతో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. అందుకే ఈ రోజు తప్పనిసరిగా సరస్వతీ దేవిని పూజించాలని పండితులు చెబుతారు. ఉదయాన్నే లేచి.. స్నానాధికాలు కానించి ఉతికిన లేదా కొత్త తెల్లని వస్త్రాలు ధరించి గంధం పూసుకోవాలి.


అనంతరం పూజ ప్రదేశాన్ని సిద్ధం చేయాలి. పద్మం, శంఖం, చక్రం ముగ్గు వేసి దానిపై పీటను ఉంచాలి. పీటపై సరస్వతీ దేవి ప్రతిమ లేదా ఫొటో ఉంచాలి.. అమ్మవారిని శ్వేత లేదా పసుపురంగు వస్త్రాలతో అలంకరించాలి. ముందుగా గణపతి పూజచేయాలి. అమ్మవారి ఫొటో ముందు మినప పిండితో చేసిన ప్రమిదలో నెయ్యి వేసి.. వత్తి పెట్టి దీపం వెలిగించాలి. సరస్వతీదేవిని తెల్లని పుష్పాలతో అర్చించాలి. పాలతో అన్నం వండి నైవేద్యం పెట్టాలి. పిండివంటలు, చెరకు, అరటిపండ్లు, కొబ్బరికాయలు నివేదించాలి. పూజ వద్ద కొత్త పుస్తకాలు, పెన్ను ఉంచాలి.


‘సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి..

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా..’

‘ఓం వాగ్దేవ్యైచ విద్మహే.. బ్రహ్మపత్న్యైచ

ధీమహీ.. తన్నో వాణీ ప్రచోదయాత్..’

‘ఓం సరస్వత్యైనమ:’ మంత్రాల్లో ఏది వీలైతే దానిని 21 మార్లు చదివి అమ్మవారికి హారతివ్వాలి.


పెళ్లి ముహూర్తాలకు మంచి రోజు


హిందూమతం ప్రకారం వసంత పంచమి నాడు శివుడు, పార్వతి దేవిల తిలకోత్సవం జరిగింది. అందుకే ఈ రోజు పెళ్లికి చాలా మంచి ముహూర్తమని పండితులు చెబుతుంటారు.

Latest News