విధాత: దక్షిణ అయోధ్యగా ప్రఖ్యాతిగాంచి గోదావరి తీరాన కొలువైన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి పట్టాభిషేక మహోత్సవం సోమవారం వైభవంగా సాగింది. శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా కల్యాణోత్సవంతో ఒక్కటైన కల్యాణమూర్తులు సీతారామచంద్రులు పట్టాభిషేక మహోత్సవంలో ఒక్కటిగా భక్తులకు దర్శనమిచ్చారు.
పట్టాభిషేక మహోత్సవంలో భద్రాద్రి రామయ్యకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రీ రామ పట్టాభిషేకానికి ఊరేగింపుగా పట్టు వస్త్రాలు, పట్టాభిషేకం మహోత్సవ ఆయుధాలు, అలంకరణాలను తీసుకువచ్చారు.
భద్రాచలం మిథిల స్టేడియం వేదికగా నిర్వహించిన రాములోరి పట్టాభిషేకోత్సవంలో భాగంగా రాములోరికి రాజదండం, రాజముద్రిక, ఛత్రం, శంఖు, చక్రాలు,రాజమకుటం, ముత్యాల హారం అలంకరణలను వేద పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య వైభవంగా నిర్వహించారు. పట్టాభిషేకంలో 500 పుణ్య నది జలాలు..నాలుగు సముద్ర జలాలతో కూడిన కలశ అభిషేకించారు. శాస్త్రయుక్తంగా సాగిన పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించిన భక్తులు రామనామస్మరణతో పులకించారు.