విధాత: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం మీథిల స్టేడియంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. అభిజిత్ లగ్న ముహూర్తంలో జగన్మాత సీతమ్మ వారి మెడలో జగత్ రక్షకుడు శ్రీ రామ చంద్రుడు మాంగళ్య ధారణ చేశారు.
లోక కల్యాణ కారకమైన సీతారాముల పరిణయ క్రతువును అర్చక పండిత బృందం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తజనం భక్తి పారవశ్యంలో పులకించారు.
కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివవచ్చారు. సీతారాముల పరిణయం ఘట్టంతో భద్రాచలం క్షేత్రం రామనామస్మరణతో మారు మ్రోగింది.
సీతారాముల కల్యాణోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం తరుపున సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. స్వామివారికి సోమవారం పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు.