Site icon vidhaatha

Revanth Reddy | సామాన్యుడిలా.. సన్న బియ్యం లబ్దిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి భోజనం

విధాత: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూత‌నంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం అమలులో భాగంగా ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుడు శ్రీనివాస్ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో కలిసి భోజనం చేశారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ కుటుంబంతో కలిసిపోయి ఇంటి స‌భ్యుడిగా సన్న బియ్యంతో వండిన వంట రుచి చూశారు.

శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో సీతారామ చంద్రులకు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు బహూకరించడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం కార్యక్రమాన్ని కూడా ప్రత్యక్షంగా పరిశీలించారు. సన్న బియ్యంతో వండిన వంటలు రుచి చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ కుటుంబ జీవన విధానం, పండిస్తున్న పంటలు తదితర వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆ కుటుంబ సభ్యులకు కొత్త బట్టలు బహుకరించి దీవించారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వారింట్లో భోజనం చేయడంతో ఆ కుటుంబంతో పాటు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు.

స్థానికులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని స్థానికులు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన బాగుందని కితాబిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు సీఎస్ శాంతి కుమారి ఉన్నారు.

Exit mobile version