Site icon vidhaatha

సీతమ్మవారికి సిరిసిల్ల ‘బంగారు’ చీర

విధాత: దక్షిణాది అయోధ్య భద్రాచల పుణ్య క్షేత్రం సీతా రాములవారి కళ్యాణ మహోత్సవానికి ముస్తాబైంది. పవిత్ర గోదావరి నదీ ఒడ్డున.. మిథిలా స్టేడియంలో జానకీ రాముల పెళ్లికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. భక్తులకు పంచేందుకు 200 క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు ఆలయ అధికారులు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేటలో సీతమ్మ వారికి బంగారు పట్టు చీర తయారయింది. శ్రీ రామనవమి సందర్భం భద్రాచలం సీతారాముల కల్యాణానికి సిరిసిల్ల చేనేత కార్మికుడు పట్టు వస్త్రాలను తయారు చేశాడు.

వన్ గ్రామ్ గోల్డ్ జరి పట్టు దారంతో…

సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు హరిప్రసాద్ పది రోజుల పాటు శ్రమించి పట్టుచీరపై కొంగులో భద్రాద్రి దేవాలయం, మూల విరాట్, దేవతామూర్తులను వచ్చే విధంగా.. చీరా కింది బార్డర్‌లో శంఖు, చక్ర నామాలు, హనుమంతుడు, గరుత్మంతుడు వచ్చే విధంగా ప్రత్యేకంగా రూపొందించారు.చీరపై ‘శ్రీరామ రామ రామేతి..’ శ్లోకాన్ని 51 సార్లు వచ్చేలా అద్భుతంగా నేశాడు. వన్ గ్రామ్ గోల్డ్ జరీ పట్టుతో నేసిన ఈ ఏడు గజాల చీర బరువు 800 గ్రాములు. ఏటా సీతారాముల కళ్యాణానికి పట్టువస్త్రాలు నేసే అవకాశం సిరిసిల్ల నేతన్నలకు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి చేనేత కార్మికుడు హరిప్రసాద్ విజ్ఞప్తి చేశారు.

నేతలో ప్రయోగాలు..అద్భుతాలు

హరి ప్రసాద్ చేనేత వస్త్రాల తయారీలో ఎప్పటికప్పుడు వినూత్న ప్రయోగాలు చేస్తు అబ్బుర పరుస్తున్నాడు. మొదట అగ్గిపెట్టలో ఇమిడే చీర, సూది రంద్రంలో దురే చీర నేసి అబ్బురపరిచాడు. అంతటితో ఆగకుండా దేశంలో ఉన్న ప్రముఖ దేశ, విదేశాల ప్రధాన నేతల ముఖచిత్రాలు, న్యూజిలాండ్ ప్రధానమంత్రి ముఖచిత్రం నేసి ప్రధాని మోదీకి పంపించాడు. భారతరత్న, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా సచిన్ భార్య అంజలి ఫోటోలు మగ్గంపై నేసి అందించారు. భారత్ లో జరిగిన జీ20 సదస్సు లోగో నేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందించి ప్రశంసలందుకున్నాడు. 95 ఏపిసోడ్ మన్ కి బాత్ లో హరి ప్రసాద్ నేసిన చేనేత ప్రాముఖ్యతను ప్రధాని మోదీ ప్రపంచానికి చాటి చెప్పారు .

Exit mobile version