Vemulawada | గుచ్చుకుంటున్న గులాబీ ముళ్ళు.. చెన్నమనేని-చలిమెడ మధ్య అంతర్గత పోరు

Vemulawada ఇబ్బందులకు గురి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్యే వేములవాడలో నడుస్తున్న ఫ్లెక్సీ వార్ విధాత బ్యూరో, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ(Vemulawada) నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య కొనసాగుతున్న వర్గ పోరు పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళింది. స్థానిక శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ బాబు, రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుండి టికెట్ ఆశిస్తున్న చలిమెడ లక్ష్మీనరసింహా రావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇటీవల జరిగిన మహాశివరాత్రి ఉత్సవాలు, తాజాగా […]

  • Publish Date - April 25, 2023 / 02:58 PM IST

Vemulawada

  • ఇబ్బందులకు గురి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్యే
  • వేములవాడలో నడుస్తున్న ఫ్లెక్సీ వార్

విధాత బ్యూరో, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ(Vemulawada) నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య కొనసాగుతున్న వర్గ పోరు పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళింది. స్థానిక శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ బాబు, రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుండి టికెట్ ఆశిస్తున్న చలిమెడ లక్ష్మీనరసింహా రావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇటీవల జరిగిన మహాశివరాత్రి ఉత్సవాలు, తాజాగా చెలిమెడ జన్మదిన వేడుకల సందర్భంగా వేములవాడలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వీరిద్దరి మధ్య అగాథాన్ని మరింత పెంచాయి.

కరీంనగర్ లోని చలిమెడ ఆనందరావు వైద్య విజ్ఞాన సంస్థ చైర్మన్ గా ఉన్న లక్ష్మీనరసింహారావు 2021 డిసెంబర్ లో అధికార బీఆర్ఎస్ లో చేరారు. వేములవాడ శాసనసభ నియోజకవర్గం నుండి ఆయన టికెట్ ఆశిస్తున్నారు. అదే నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం మల్కపేట ఈయన స్వగ్రామం.

బీఆర్ఎస్ లో చేరిన వెంటనే మంత్రి కే తారక రామారావు పిలుపు అందుకుని తమ గ్రామంలోని పాఠశాలను రెండు కోట్ల నిధులతో ఆధునికరించారు. నియోజకవర్గంలో వైద్య శిబిరాలు, ఇతర స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతూ ప్రజలతో మమేకం అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇది సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు వర్గీయులకు ఏమాత్రం రుచించడం లేదు. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడకు వచ్చే లక్షలాదిమంది భక్తులను దృష్టిలో ఉంచుకొని, వారికి స్వాగతం పలుకుతూ లక్ష్మీనరసింహారావు పేరిట ఆయన మద్దతుదారులు పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ మున్సిపల్ సిబ్బంది తొలగించారు.

దీని వెనక ఎమ్మెల్యే ఆదేశాలు ఉన్నాయని చలిమెడ వర్గీయులు మండిపడ్డారు. ‘ పోస్టర్లు ఫ్లెక్సీలు మాత్రమే ఓ వ్యక్తిని నాయకుడిగా మార్చలేవంటు’ ఎమ్మెల్యే రమేష్ బాబు చేసిన వ్యాఖ్యలు చలిమెడ వర్గీయులకు పుండు మీద కారం రాసినట్టు అయ్యాయి.

తాజాగా లక్ష్మీనరసింహారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ మూడవ వార్డు కౌన్సిలర్ నిమ్మ శెట్టి విజయ్ పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాననే కారణంతో రమేష్ బాబు పోలీసుల ద్వారా తనను బెదిరించారని విజయ్ ఆరోపించారు. తన ఇంటికి పోలీసులను ఎమ్మెల్యే పంపించారని మండిపడ్డారు. ఈ విషయంలో స్థానిక సీఐ తనను బెదిరిస్తున్నారని, అయితే కేసులకు భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

విద్యార్థి దశ నుండే తాను పార్టీ కోసం పనిచేస్తున్నానని… పార్టీ కోసం కష్టపడుతున్న తనకే ఇలా జరిగితే… పార్టీ సాధారణ కార్యకర్తలకు ఏం భరోసా ఉంటుందన్నారు. ఈ అంశాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళతానని అన్నారు.

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రమేష్ బాబు తన ఫోటోలు, వీడియోలు అనుమతి లేకుండా ఉపయోగించినా, ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేసినా పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాదు, అవసరమైతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అసభ్య, అసత్య ప్రచారాలు చేస్తే పార్టీ పరంగా చర్యలు తప్పవన్నారు.

పట్టణ కౌన్సిలర్ ఎమ్మెల్యే మధ్య నడిచిన మాటల యుద్ధం వేములవాడలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ పరిణామాల అనంతరం లక్ష్మీనరసింహారావు వర్గీయుల్లో ఆగ్రహ వేషాలు వ్యక్తం అవుతున్నాయి. చలిమెడను పార్టీలో చేర్చుకొని ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేశారని వారు భగ్గుమంటున్నారు. పార్టీలో చేరిన నాటి నుండి నియోజకవర్గం పార్టీ కార్యక్రమాలకు ఆయనకు పిలుపు అందకపోవడం పట్ల వారు మండిపడుతున్నారు. పార్టీ ఐ కమాండ్ అనుసరిస్తున్న తీరును వారు తప్పుపడుతున్నారు.

బోయినపల్లి వ్యాఖ్యల కలకలం

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఏప్రిల్ 9న వేములవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిట్టింగులకే టికెట్లు అని కెసిఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

వరుసగా నాలుగు సార్లు ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యునిగా గెలుపొందిన వ్యక్తిని కాదని కొత్తగా మరొకరికి టికెట్ ఇచ్చే ప్రసక్తే ఉండదని తేల్చి చెప్పారు. రానున్న ఎన్నికల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్న చలిమెడ వర్గీయుల ఆశలపై ఈ వ్యాఖ్యలు నీళ్లు చల్లాయి.

టిడిపి నుండి టిఆర్ఎస్ వరకు

తెలుగుదేశం పార్టీకి చెందిన చెన్నమనేని రమేష్ బాబు 2009 ఎన్నికల్లో అదే పార్టీ తరఫున వేములవాడ నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. 2010లో బీఆర్ఎస్ లో చేరిన ఆయన నాడు జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తిరిగి 2014, 2018 శాసనసభ ఎన్నికల్లోను తిరుగులేని విజయం సాధించారు.

కొలిక్కిరాని పౌరసత్వ సమస్య

చెన్నమనేని రమేష్ బాబుపై వరుసగా మూడుసార్లు ఓటమి చవిచూసిన కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఆయన పౌరసత్వంపై న్యాయస్థానాలను ఆశ్రయించారు. రెండు దశాబ్దాలు గడిచినా ఈ కేసు నేటికీ ఓ కొలిక్కి రాలేదు.

కరీంనగర్ వదిలినా.. కలసి రావడం లేదా?

చలిమెడ లక్ష్మీనరసింహారావు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2007లో కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చెన్నాడి సుధాకర్ రావు చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ కార్యదర్శి పదవితో పాటు అనేక హోదాలలో ఆయన పని చేశారు.

2009 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి గంగుల కమలాకర్ పై ఓటమి చెందారు. 2014 ఎన్నికల్లో లక్ష్మీనరసింహారావు బీఆర్ఎస్ లో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తారని అందరూ భావించారు. అయితే అప్పటికే తెలుగుదేశం పార్టీ నుండి బీఆర్ఎస్ లో చేరిన గంగుల కమలాకర్ కరీంనగర్ బెర్త్ ఖరారు చేసుకున్నారు. 2014లో మరో మారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినా ఫలితం దక్కలేదు.

2018 ఎన్నికల్లో చలిమెడకు కరీంనగర్ నుండి గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ పార్టీ అధిష్టానం ఆయనకు టికెట్ నిరాకరించి పొన్నం ప్రభాకర్ ను తమ అభ్యర్థిగా పోటీలో ఉంచింది. దీంతో 2021లో బీఆర్ఎస్ లో
చేరిన లక్ష్మీ నరసింహారావు తన సొంత నియోజకవర్గం వేములవాడ నుండి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూశారు. అయితే ఆదిలోనే ఆయనకు అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి.