Site icon vidhaatha

యువ రైతు మృతి దురదృష్టకరం

న్యూఢిల్లీ: కనీస మద్దతు ధర కోసం రైతులు చేస్తున్న ఆందోళనలో ఒక యువ రైతు చనిపోవడంపై మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. రైతు మృతి దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన ఒక పోస్ట్‌ పెట్టారు. ‘ప్రస్తుతం కొనసాగుతున్న ఆందోళనలో ఒక రైతు చనిపోవడం దురదృష్టకరం. అందరికీ ఆమోదయోగ్యమైన ఫలితం వచ్చేందుకు సుహృద్భావ, అర్థవంతమైన వాతావరణంలో ప్రభుత్వం, రైతు సంఘాలు కృషి చేయాలని కోరుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వామ్య పక్షాలన్నీ శాంతియుతంగా ఉండాలి’ అని పేర్కొన్నారు.


పంటలకు కనీస మద్దతు ధర కోసం రైతులు ఫిబ్రవరి 13వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. వారు ఢిల్లీకి వెళ్లకుండా పంజాబ్‌-హర్యానా సరిహద్దుల వద్ద హర్యానా పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో బుధవారం మళ్లీ చలో ఢిల్లీ మార్చ్‌ను రైతులు పునఃప్రారంభించడంతో వారిని పోలీసులు నిలువరించారు. ఈ సందర్భంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో యువ రైతు చనిపోయాడని రైతు సంఘాలు పేర్కొన్నాయి.

Exit mobile version