రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, కేంద్రంలో కాంగ్రెసే ప్రత్యామ్నాయం.. ఎందుకంటే..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ నేతలు ఊదరగొట్టారు

  • Publish Date - March 27, 2024 / 02:09 PM IST

విధాత ప్రత్యేకం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ నేతలు ఊదరగొట్టారు. కేసీఆర్‌ను అధికారంలోంచి దించే సత్తా కాంగ్రెస్‌ పార్టీకి లేదన్నారు. కానీ ఫలితాల తర్వాత బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెసే అని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అంతేకాదు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకొన్న బీజేపీకి పది సీట్లు కూడా ఇవ్వలేదు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోటీ ఉన్నా కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతోనే జాతీయపార్టీలు పోరాడాల్సి ఉంటుంది.

సికింద్రాబాద్‌ నియోజకవర్గ నేతల సమావేశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాట్లాడుతూ.. ‘బీజేపీని ఆపే దమ్ము కాంగ్రెస్‌కు లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ కాదు.. బీజేపీనే అధికారంలో ఉన్నట్లుగా ఉన్నది’ అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఖాతా తెరుస్తుందా? ఫలితాల తర్వాత పార్టీ మనుగడ సాగిస్తుందా? అనే సందేహాలు వ్యక్తమౌతున్న వేళ పార్టీ కార్యకర్తలు, శ్రేణుల్లో భరోసా నింపడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు. పైన పేర్కొన్నట్టు బెంగాల్‌, బీహార్‌, ఒడిశా, ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలతోనే ప్రధాన పోటీ ఉంటుంది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ప్రధాన పోటీ అధికార కాంగ్రెస్‌తోనే ఉంటుంది. బీజేపీ పోటీలో ఉన్నప్పటికీ ఇక్కడ ఆ పార్టీ ప్రభావం కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అన్న స్థాయిలో ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్‌ఎస్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆ పార్టీ నేతలు వెనుకంజ వేస్తున్న సంగతి తెలిసిందే. వాళ్లలో కొందరు బీజేపీ, మరికొందరు కాంగ్రెస్‌ వైపు వెళ్లారు. టికెట్లు తెచ్చుకున్నారు. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో (హైదరాబాద్‌ మినహా) దాదాపు 16 స్థానాల్లో బీఆర్‌ఎస్‌కు ప్రత్యర్థి ఆ పార్టీని వీడిన అభ్యర్థే. (వాళ్లలో ఎక్కువశాతం మంది బీజేపీ లేదా కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉంటారు) అందుకే కేటీఆర్‌ పోటీలో ఉన్న అభ్యర్థుల కంటే ప్రధాని మోదీని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 37.35 శాతం ఓట్లు.. పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి గణనీయంగా తగ్గుతాయన్న చర్చ జరుగుతున్నది. గత ఎన్నికల్లో 9 సీట్లు గెలిచిన బీఆర్‌ఎస్‌కు ఈసారి మెదక్‌ మినహా వేరే చోట అవకాశాలు ఉండకపోవచ్చని అంటున్నారు. బీఆర్‌ఎస్‌కు వచ్చిన 39 సీట్ల మేరకు మూడు, నాలుగు స్థానాల్లోనైనా విజయం సాధించకపోతే కష్టమే అనే అభిప్రాయం బీఆర్‌ఎస్‌ కీలక నేతల్లో ఉన్నది. అందుకే కవిత అరెస్టు అంశంలో బీజేపీని బద్నాం చేయడానికి, అలాగే ప్రధాని మోదీ పాల్గొన్న అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణానికి వెళ్లకుండా స్నేహపూర్వకంగా ఉంటామని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పదే పదే ఉదహరిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ను ఓడించడానికి కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటయ్యాయని వీటిని చూపిస్తూ ఆరోపిస్తున్నారు. అంతేగానీ దీనికి ఆధారాలంటూ ఏమీ లేవు. అంతా తమ పార్టీ మనుగడ కోసం కేసీఆర్‌ అనుసరిస్తున్న వ్యూహాలు మాత్రమే అని అర్థమౌతున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.

బీజేపీ సర్కారుపైనా ప్రజా వ్యతిరేకత

పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చినట్టే కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీపైనా వ్యతిరేకత ఉన్నది. నిరుద్యోగం, పంటలకు మద్దతు ధరల విషయంలో రైతుల అందోళన, ద్రవ్యోల్బణం వంటివి బీజేపీ ఓటు బ్యాంకుకు గండికొట్టేలా ఉన్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, పార్టీకి చెడ్డ పేరు తెచ్చారనో, లేదా ఇతర కారణాలను చూపెట్టి 2019లో లక్ష నుంచి 6 లక్షల వరకు మెజారిటీతో గెలిచిన 39 మందిని సిట్టింగులకు టికెట్లు ఇవ్వకుండా కొత్తవారిని తెరపైకి తెచ్చింది. గత ఎన్నికల్లో యూపీ, గుజరాత్‌, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్‌, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కాషాయ పార్టీకి గణనీయంగా సీట్లు రావడం వల్లనే సొంతంగా 303 సీట్ల మార్క్‌ను చేరుకోగలిగింది. ఈసారి అంతకుమించి 400 సీట్లే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ఆ పార్టీకి అంత సీన్ లేదని గణాంకాలు, విశ్లేషణలు చెబుతున్నాయి. అందుకే ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను కలుపుకొని వెళ్తున్నదనే అభిప్రాయాలు ఉన్నాయి. 13 స్థానాలున్న పంజాబ్‌లో 2020 సెప్టెంబర్‌లో ఎన్డీఏను వీడిన అకాలీదళ్‌ను తిరిగి కూటమిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. అలాగే ఒడిశాలోనూ బీజూ జనతాదళ్‌తో అలాంటి చర్చలే బీజేపీ చేసింది. అక్కడ కూడా కుదరకపోవడంతో ఒంటరి పోటీకి సిద్ధపడింది. వివిధ రాష్ట్రాల్లో జరిగే నష్టాన్ని కొంతవరకు పూడ్చుకోవడానికి ఏపీలో టీడీపీ, జనసేనతో, కర్ణాటకలో జేడీఎస్‌తో జత కట్టడంతోపాటు.. గాలి జనార్దన్‌రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకున్నది.

ఈ పరిణామాలను చూస్తుంటే లోక్‌సభ ఎన్నికల్లో రెండు మూడు సీట్లైనా గెలువడం కోసం రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ మనుగడ కోసం పోరాడుతుంటే.. కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ అధినాయకత్వ ఆపసోపాలు పడుతున్నట్టు అర్థమౌతున్నది. అందుకే రాష్ట్రంలో పది స్థానాలే లక్ష్యంగా వ్యూహ రచన చేసి ముందుకెళ్తున్నదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ నేతలు ప్రచారం చేశారు. అలాగే తాజాగా కేంద్రంలో బీజేపీని అడ్డుకునే దమ్ము కాంగ్రెస్‌ లేదని కేటీఆర్‌ వ్యాఖ్యానించినా ఆ సత్తా ఆపార్టీకి కూడా లేదు. అందుకే రాష్ట్రం వరకు అధికార కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్‌. కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. కాన్ని రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలు ప్రాంతీయపార్టీలను ఎదుర్కోవాల్సి వచ్చినా కేంద్రంలో బీజేపీ యేతర ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే కాంగ్రెస్‌ పార్టీ లేకుండా అది సాధ్యం కాదన్నది వాస్తవం.

Latest News