చేతికొచ్చిన కూతురు కళ్లముందు ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన విజయ్ ఆంటోని వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు. ఆయన పెద్ద కూతురు మీరా (16) చెన్నైలోని డిడికె రోడ్‌లోని తన ఇంట్లో తెల్లవారుఝామున 3 గంటలకు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఎంతో భవిష్యత్ ఉన్న మీరా అలా చనిపోవడం ప్రతి ఒక్కరిని ఎంతో బాధించింది. మీరా ఆత్మహత్య కోలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమని కూడా ఉలిక్కి పడేలా చేసింది.
చెన్నైలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈమె 12వ తరగతి చదువుతున్న మీరా సూసైడ్ చేసుకోవడానికి కారణం మానసిక ఒత్తిడి మాత్రమే అని కొందరు చెప్పుకొస్తున్నారు. విజయ్ ఆంటోని కూతురు మీరా సూసైడ్ ని చెన్నై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగి ఆమె సూసైడ్ చేసుకొన్న గదిని తనిఖీలు చేయగా, . ఆమె నుంచి చివరి ఫోన్ కాల్ ఎవరికి వెళ్లింది? చివరి మెసేజ్ ఎవరికి వెళ్లింది? ఎవరి నుంచి వచ్చిందనే కోణంలో విచారణ జరుగుతుంది.
అయితే కూతురి మరణం తర్వాత విజయ్ ఆంటోని చాలా ఎమోషనల్ కాగా, ఆయన తొలిసారి తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన కుమార్తెతో పాటు తానూ చనిపోయానని, ఇక నుంచి తాను చేయబోయే ప్రతి మంచి పనిని కూడా ఆమె పేరుతోనే చేస్తానని, అప్పుడైనా ఆమె తనతో ఉన్నట్లుగా భావిస్తానని విజయ్ అన్నారు.
నా కూతురు ప్రేమగల, ఎంతో ధైర్యవంతురాలైన అమ్మాయి అని చెప్పిన విజయ్ ఆంటోని… ఇప్పుడు ఆమె ఏ కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, శత్రుత్వం లేని ఓ మంచి, నిశ్శబ్ద ప్రదేశానికి వెళ్లిపోయిందంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. తన కూతురు ఇప్పటికీ తనతోనే ఉన్నట్లుగా ఉందని, తాను కూడా కూతురుతో పాటు మరణించానని ఎమోషనల్ గా ఆ నోట్‌లో రాసుకొచ్చారు విజయ్ ఆంటోని. అతని పోస్ట్ ప్రతి ఒక్కరిని కలిచి వేస్తుంది. ధైర్యంగా ఉండాలంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.