విధాత: మంచు మోహన్‌బాబు, విష్ణు అభిమానులకు, తెలుగు మీమర్స్‌కు ఇది ఎంతో నిరాశ కలిగించే వార్త. మంచు విష్ణు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్టుగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప (Kannappa). ఇప్పటికే విడుదల చేసిన గ్లిమ్స్, టీజర్, పాటలు సినిమాపై అంచనాలను సైతం పెంచాయి. అంతా బాగుంది మరో నాలుగు వారాల్లో సినిమా (ఏప్రిల్ 25)న థియేటర్లలోకి రానున్న క్రమంలో చిత్ర యూనిట్ బాంబ్ పేల్చింది. సినిమా విడుదలను మరి కొన్ని వారాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తూ నటుడు, నిర్మాత మంచు విష్ణు మీడియాకు ఓ లెటర్ రిలీజ్ చేశాడు.
ఈ సందర్భంగా సినిమాలో ఓ కీలక సన్నివేశాలకు సంబంధించి సీజీ వర్క్ బ్యాలెన్స్ ఉందని దానిని మరింత జాగ్రత్తగా చేయాల్సి ఉందని, ప్రేక్షకులకు మంచి విజువల్‌ట్రీట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఇదిలాఉండగా ఐపీఎల్ సీజన్ జోరుగా సాగుతుండడం, సినిమా విడుదల సమయానికి ఎండలు అదిరిపోయే వకాశం ఉండడం కూడా సినిమా వాయిదాకు ఓ కారణం అని తెలుస్తోంది. ఈ సినిమా వాయిదా పడడంతో దాని స్థానంలో మరో సినిమా విడుదలకు ముస్తాబయింది.
అయితే ఈ సినిమా గత డిసెంబర్లోనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ నాలుగు నెలలు వాయిదా వేసుకున్నారు. తిరిగి ఇప్పుడు మళ్లీ వాయిదా వేయడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. మరోవైపు మంచు మనోజ్ కీలక పాత్ర పోషించిన భైరవం చిత్రం విడుదల ఏప్రిల్ 25నే ఉండడం విశేషం. ఇక గతంలో ‘స్టార్ ప్లస్‌లో ప్రసారమయిన ‘మహాభారత్’ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ (Mukhesh Kumar Singh) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా, సీనియర్ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయిమాధవ్, తోట ప్రసాద్ ఈ కథకు తుది మెరుగులు దిద్దారు. కేరళకు చెందిన స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించాడు.
ఈ మూవీలో మోహన్ లాల్ (Mohanlal), రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), మోహన్ బాబు (Mohan Babu M), అక్షయ్ కుమార్ (Akshay Kumar), శివ రాజ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల, కాజోల్, ప్రీతి ముకుందన్ (Preity Mukundhan) కీలక పాత్రల్లో నటించారు. అవా ఎంటర్టైన్మెంట్ (AVA Entertainments) మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం (Twenty Four Frames Factory)పై మోహన్ బాబు (Mohan Babu) ఈ చిత్రాన్నిభారీ బడ్జెట్‌తో నిర్మించారు.