Site icon vidhaatha

“విశ్వంభ‌ర” – మెగాస్టార్ కెరీర్‌లో మ‌రో మ‌కుటం

మెగాస్టార్ చిరంజీవి, యంగ్ సెన్సేష‌న్ వ‌శిష్ట మ‌ల్లిడి కాంబినేష‌న్లో రూపుదిద్దుకుంటున్న ‘విశ్వంభ‌ర’ చిత్రం మూవీ ల‌వ‌ర్స్‌ను రిలీజ్‌కు ముందే విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. టైటిల్ గ్లింప్స్‌తో అద‌ర‌గొట్టిన వ‌శిష్ట‌, సినిమాలో మ్యాజిక్ ఉంటుందని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసాడు.

నిజానికి చిరంజీవి ఒక డోలాయ‌మాన‌స్థితిలో ఉన్నాడు. ఎటువంటి సినిమా చేయాల‌నేది అయ‌న సందేహం. వ‌య‌సు రీత్యా యువ‌కుడి పాత్ర చేస్తూ, హీరోయిన్ల‌తో ఆడిపాడితే, ఇదివ‌ర‌క‌టిలా ప్రేక్ష‌కులు రిసీవ్ చేసుకోలేరు. ఫ్యాన్స్ వ‌ర‌కైతే ఓకే. కానీ, ఇప్పుడు వాళ్లు కూడ న‌చ్చ‌డంలేదు. ‘వాల్తేర్ వీర‌య్య’ హిట్ అయినా, శృతిహ‌స‌న్‌తో కాంబినేష‌న్ వ‌ర్క‌వుట్ కాలేదు. అందుక‌ని క‌మ‌ల్, ర‌జ‌నీల్లాగా వ‌య‌సును బ్యాలెన్స్ చేస్తూ, హీరోయిజాన్ని ఎలివేట్ చేసే క‌థ‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందులో భాగమే ‘విశ్వంభ‌ర‌’.

‘బింబిసార‌’తో సంచ‌ల‌నం సృష్టించిన వ‌శిష్ట‌, విశ్వంభ‌ర కోసం ఓ స‌రికొత్త లోకాన్నే సృష్టించ‌బోతున్నాడ‌ట‌. పూర్తిగా సోషియో-ఫాంట‌సీ జాన‌ర్‌లో ముల్లోకాలు, దేవుళ్లు, దేవ‌క‌న్య‌లు, మాన‌వ‌శ‌క్తి వంటి విభిన్న కాన్సెప్ట్‌తో ప్ర‌యోగం చేస్తున్నాడు. ఈ కాన్సెప్ట్ అంటేనే గ్రాఫిక్స్‌. అందుకే క‌ళ్లు చెదిరే గ్రాఫిక్స్‌తో, 200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రం త‌యార‌వుతోంది. రెబెల్‌స్టార్‌ ప్ర‌భాస్ స్వంత బ్యాన‌ర్ లాంటి యువీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇక ఇందులో చిరంజీవి దొర‌బాబు అనే గోదావ‌రి జిల్లావాసిగా క‌నిపించ‌బోతున్నాడ‌ని, ఆ పాత్ర‌కు ఐదుగురు చెల్లెల్లుంటార‌ని తెలుస్తోంది. సిస్ట‌ర్ సెంటిమెంట్ చిరంజీవికి హిట్ల‌ర్‌తో క‌మ్‌బ్యాక్ సెంటిమెంట్‌. ఇప్ప‌టికే ఆ ఐదుగురిని ఎంపిక చేసార‌ని తెలిసింది. మృణాల్ ఠాకుర్‌, సుర‌భి, ఇషా చావ్లా, అషికా రంగ‌నాథ్‌, ఇంకో నాయిక చెల్లెల్ల పాత్ర‌ల‌ను పోషిస్తున్నార‌ట‌. త్రిష ఎలాగూ మెయిన్ లీడ్‌. అయితే ఇందులో మృణాల్ ఠాకూర్ పాత్ర సందేహాస్ప‌దంగా ఉంది. చెల్లెలంటున్నారు, కాదంటున్నారు. మ‌రేంటో చిత్ర‌బృందం క్లారిటీ ఇస్తే కానీ తేల‌దు. ఇంకో ముఖ్య‌పాత్ర‌ను వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ పోషిస్తున్నారు. విల‌న్లుగా రానా ద‌గ్గుబాటి, త‌మిళ హీరో శింబు ఎన్నిక‌య్యార‌ట‌.

ఇంకో స్ట‌న్నింగ్‌ విష‌య‌మేమిటంటే, చిరంజీవి ఇందులో డ‌బుల్ రోల్ చేస్తున్నార‌ట‌. ఒక‌టి పూర్తిగా వృద్ధుడి పాత్ర కాగా, ఇంకోటి మిడిల్ ఏజ్డ్ పాత్ర అని అనుకుంటున్నారు. రెండు పాత్ర‌లు క‌థ‌లో చాలా గొప్ప‌గా ఎలివేట్ కాబోతున్నాయ‌ని చిత్ర బృందానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న‌వారి టాక్‌. ఏదేమైనా వ‌శిష్ట మాత్రం గొప్ప న‌మ్మ‌కంగా ఉన్నాడు. చిరంజీవి కూడా ఈ చిత్రం ప‌ట్ల త‌న సంతోషం వ్య‌క్తం చేసాడు. మెగాస్టార్ కెరీర్‌లో టాప్ 3లో ఉంటుంద‌ని వ‌శిష్ట ఇప్ప‌టికే స్టేట్‌మెంట్ కూడా ఇచ్చేసాడు. సైలెంట్‌గా షెడ్యూల్లు పూర్తి చేసుకుంటున్న విశ్వంభ‌ర‌, ప్ర‌తీరోజూ ఒక సంచ‌ల‌నంతో టాక్ ఆఫ్ ద మీడియాగా మారిపోయింది. దాంతో బిజినెస్ కూడా విప‌రీతంగా జ‌రిగింద‌ని స‌మాచారం. విజువ‌ల్ వండ‌ర్‌గా భార‌త‌ చిత్ర‌సీమ‌లోనే ఈ పాన్ ఇండియా సినిమా ఒక చ‌రిత్ర సృష్టించ‌బోతుంద‌ని యువీ నిర్మాత‌లు గట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. నిన్న‌టి నుండి శోభి మాస్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో హైద‌ర‌బాద్ శివార్ల‌లో ఒక పాట షూట్ మొద‌లైంది. చిరంజీవి, త్రిష‌తో పాటు మ‌రికొంత మంది తారాగ‌ణం చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నారు.

Exit mobile version