Site icon vidhaatha

Vivekananda Murder Case | వైఎస్ వివేకా హ‌త్య కేసులో కీల‌క మ‌లుపు.. ఎంపీ అవినాశ్ తండ్రి అరెస్ట్

Vivekananda Murder Case | ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో కీల‌క మ‌లుపు చోటు చేసుకుంది. వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్క‌ర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉద‌యం పులివెందుల‌లోని భాస్క‌ర్ రెడ్డి నివాసంలో ఆయ‌న‌ను అదుపులోకి తీసుకుని, క‌డ‌ప‌కు త‌ర‌లించారు.

భాస్క‌ర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేయ‌డాన్ని వైసీపీ తీవ్రంగా వ్య‌తిరేకించారు. సీబీఐ అధికారుల వాహ‌నాన్ని కార్య‌క‌ర్త‌లు అడ్డుకుని వారికి వ్య‌తిరేకంగా నిన‌దించారు. దీంతో అక్క‌డ స్వ‌ల్ప ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. వివేకా హత్యకేసులో ఆరుగురు ప్రధాన నిందితుల్లో భాస్కర్‌ రెడ్డి ఒకరు. కాగా, సెక్షన్‌ 130 బీ, రెడ్‌ విత్‌ 302, 201 కింద కేసు నమోదుచేసిన సీబీఐ.. భాస్కర్‌ రెడ్డిని అదుపులోకి తీసుకుంటున్నట్లు ఆయన సతీమణికి సమాచారం ఇచ్చారు.

ఇక హైదరాబాద్‌లో ఉన్న అవినాశ్‌ రెడ్డి నివాసానికి కూడా సీబీఐ అధికారులు చేరుకున్నారు. వివేకా హత్య కేసులో అవినాశ్‌ను అధికారులు ఇప్పటికే నాలుగుసార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం అవినాశ్‌ రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్‌ కుమార్‌ రెడ్డిని సీబీఐ కడపలో అరెస్టు చేసింది. సాక్ష్యాలు ధ్వంసం చేశాడన్న ఆరోపణలతో ఉదయ్‌ని అదుపులోకి తీసుకున్నది. తాజాగా భాస్కర్‌ రెడ్డిని కూడా అరెస్టు చేయడంతో అవినాశ్‌ను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

Exit mobile version