Russia |
మాస్కో : వాగ్నర్ ప్రైవేటు సైన్యం చీఫ్ యెవ్ జెని ప్రిగోజిన్ రష్యాలో జరిగిన ఒక విమాన దుర్ఘటనలో చనిపోయాడని అధికార వర్గాలు తెలియజేశాయి. కూలిన విమానం, ఎంబ్రేయర్ లెగసీ జెట్ నుండి ప్రిగోజిన్ మృత దేహంతోపాటు మొత్తం పదిమంది మృతదేహాలను స్వాధీనం చేసుకొన్నట్లు రష్యా లోని అత్యవసర సర్వీసుల విభాగం గురువారం తెలిపింది.
ఘటనా స్థలాన్ని పోలీసులు సీల్ చేశారు. విమాన ప్రమాదంపై విచారణకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 28,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న జెట్.. 30 సెకండ్ల వ్యవధిలోనే 8,000 అడుగుల ఎత్తు కంటే కిందికి జారడంతో దుర్ఘటన సంభవించినట్టు చెబుతున్నారు. అయితే.. 30 సెకండ్లకు ముందు విమానం ఫ్లైట్ ట్రాకింగ్ డాటాలో తలెత్తిన సమస్యల గురించి ఎటువంటి సూచికలు లేవని అంటున్నారు. దీంతో ఈ ప్రమాదంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
వాగ్నర్ అనేది ఒక ప్రైవేట్ మిలిటరీ ఏజన్సీ. అది గతంలో రష్యాలో ఒక తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. అప్పటి నుండే ప్రిగోజిన్ ప్రాణానికి ముప్పు వెన్నాడుతున్నది. ఆ తిరుగుబాటు అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక సందర్భంగా మాట్లాడుతూ ఆ తిరుగుబాటు తమకు ఒక వెన్నుపోటు అని, కుట్ర అని చెప్పారు. దానికి బదులు ఇస్తామని సవాల్ చేశారు.
అయితే పుతిన్, ప్రిగోజిన్ మధ్య జరిగిన ఒప్పందాలలో భాగంగా ప్రిగోజిన్‌పై వున్న ఆరోపణలను రష్యా అధ్యక్షుడు తాత్కాలికంగా ఉపసంహరించుకొన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరపున ప్రతిభావంతంగా వాగ్నర్ పోరాడింది. తరువాత వచ్చిన మార్పుల్లో కొంతమంది వాగ్నర్ సైనికులు బెలారస్ వెళ్ళిపోయారు. దానితో వాగ్నర్ గ్రూపు బలహీనపడింది.