వరంగల్ ఎంపీ అభ్యర్ధిగా సుధీర్

  • Publish Date - April 12, 2024 / 08:08 PM IST

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన
రాజయ్యకు మరోసారి షాక్
ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ లో

విధాత ప్రత్యేక ప్రతినిధి: ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్ధిగా మారపెల్లి సుధీర్ కుమార్ ను ఆ పార్టీ అధినేత కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు. ఎంపీ అభ్యర్ది విషయంలో వివిధ రకాలుగా చర్చించి తుదకు హనుమకొండ జడ్పీ చైర్మన్ గా ఉన్న మారపెల్లి సుధీర్ కుమార్ ను ఆ పార్టీ ఎంపిక చేసింది. ఈ మేరకు ఎర్రవెల్లి ఫాంహౌజ్ లో వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్యనేతలతో శుక్రవారం సమావేశమయ్యారు.

జడ్పీ చైర్మన్…మాదిగ సామాజిక వర్గం

బీఆర్ఎస్ నాయకుల సమావేశంలో సుదీర్ఘ కసరత్తు అనంతరం సుధీర్ కుమార్ పేరును కేసీఆర్ ఖరారు చేశారు. భీమదేవరపల్లికి చెందిన సుధీర్ కుమార్ 2001 నుంచి పార్టీలో ఉన్నారు. పార్టీకి విధేయుడిగాకొనసాగుతూనే హనుమకొండ జడ్పీచైర్మన్ గా ఎన్నికయ్యారు.మాదిగ సామాజిక వర్గం కావడంతో మరింత కలిసొచ్చింది. పార్టీని కాదని వెళ్ళిన రాజయ్యతో పోల్చుకుంటే సుధీర్ అవకాశం ఇస్తే పార్టీ శ్రేణుల్లో విశ్వాసం పెరుగుతుందని భావించినట్లు చెబుతున్నారు. తొలి నుంచి పార్టీలో ఉన్న ఉద్యమకారున్ని గౌరవించినట్లుగా ఉంటుందనే సుధీర్ ను ఎంపిక చేశారు.

రాజయ్యకు ఆశాభంగం

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించిన స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యకు మరోసారి ఆశాభంగం కలిగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనను కలువాలని శుక్రవారం ఆహ్వనించడంతో రాజయ్య కూడా కేసీఆర్ ను కలిసేందుకు బయలుదేరి వెళ్ళారు. ఎర్రవెల్లిలోని తన ఫాంహౌజ్ లో వరంగల్ జిల్లా నాయకులు మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాజయ్యను రావాలని కోరారు. ఫాంహౌజ్ కు బయలుదేరిన రాజయ్య మధ్యలో గౌరారంలోని హోటల్లో ఆగారు. ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో జిల్లా బీఆర్ఎస్ నాయకులతో పాటు హనుమకొండ జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్ కుమార్ ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న రాజయ్య ఫాం హౌజ్ కు వెళ్ళకుండా హోటల్లోనే ఆగిపోయారు. తన పేరు ఖరారు చేసి ప్రకటిస్తేనే ఫాం హౌజ్ కు వచ్చి కలుస్తానంటూ రాజయ్య తేల్చిచెప్పారు. వరంగల్ ఎంపీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో సుధీర్ కుమార్ పేరు కూడా పరిశీలిస్తున్నట్లు రాజయ్యకుముందుగానే తెలిసి ఈ మేరకు రాజయ్య జాగ్రత్తపడ్డారు. రాజయ్య ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఉన్నారు.రాజీనామా చేసిన రాజయ్యతో బీఆర్ఎస్ లోని కొందరు ముఖ్యనాయకులు సంప్రదింపులు జరిపిన ఫలితంగా ఎంపీ టికెట్ ఆశించిన రాజయ్య బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసేందుకు సిద్ధమయ్యారు. కానీ,మధ్యలోనే తనకు సమాచారం లీక్ కావడంతో ఫాం హౌజ్ కు వెల్లకుండానే గౌరారం నుంచి వెనుదిరిగారు. మరోసారి రాజయ్యకు భంగపాటు తప్పలేదు.

బీఆర్ఎస్ కు శ్రీహరి, కావ్య గుడ్ బై

బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్ధిగా కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్ కావ్యను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ముందుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీచేసేందుకు తప్పుకుంటున్నట్లు కావ్య ప్రకటించి సంచలననానికి తెరతీశారు. ఆ తర్వాత తన తండ్రి స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. తదుపరి కాంగ్రెస్ పార్టీ కూడా కావ్యను వరంగల్ ఎంపీ అభ్యర్ధిగా ఎంపిక చేయడం చకచకా జరిగిపోయింది. దీంతో బీఆర్ఎస్ కొత్త అభ్యర్ధిని వెదుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.

సిట్టింగ్ ఎమ్మెల్యేగా దక్కని టికెట్

స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యను కాదని ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరికి మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ సీటు కేటాయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీకి రాజీనామా ప్రకటించిన మొదటి నాయకుడు డాక్టర్ రాజయ్య. తన పట్ల అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పార్టీకి రాజీనామా చేశారు. వరంగల్ ఎంపీ సీటు తనకు కేటాయించాలని కోరేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదని విమర్శించారు. తర్వాత కాంగ్రెస్ లో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆ పార్టీ నుంచి సానూకూల స్పందన రాలేదు. రాజయ్య చేరికను స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ వర్గాలు వ్యతిరేకిస్తూ గాంధీ భవన్ ముందు ధర్నా చేశారు. ఈ స్థితిలో రాజయ్య చేరిక నిలిచిపోయింది.

ఆప్షన్ గా రాజయ్య పేరు పరిశీలన

వరంగల్ ఎంపీ అభ్యర్ధి ఎంపిక విషయంలో కేసీఆర్ కసరత్తు సందర్భంగా హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ తో పాటు ప్రస్తుతం పార్టీలో ఉన్న ఎస్సీ సామాజిక వర్గం నేతలైన పెద్ది స్వప్న, జోరిక రమేష్, బోడ డిన్నా,జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ తదితరుల పేర్లు పరిశీలించడంతో పాటు పార్టిని వీడిన రాజయ్య పేరు కూడా కేసీఆర్ పరిశీలించారు. మొన్నటి వరకు పార్టీలో ఉన్న ఇతర నాయకులు పార్టీని వీడారు. సిట్టింగ్ ఎంపి పసునూరి దయాకర్ కాంగ్రెస్ లో చేరారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ బీజేపీలో చేరి ఎంపీ అభ్యర్ధిగా బరిలో నిలిచారు. కావ్యను ఎంపిక చేస్తే పార్టీని వీడారు. దీంతో రాజయ్యను కూడా ఒక ఆప్షన్ గా భావించినట్లు చెబుతున్నారు. గతంలో పార్టీ సీనియర్ నాయకుడు, మాదిగ సామాజిక వర్గం, మాజీ ఉప ముఖ్యమంత్రి తదితర అంశాలతో రాజయ్య అభ్యర్ధిత్వాన్ని కూడా పరిశీలించినట్లు చెబుతున్నారు. పార్టీ అవసరం, తన రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆశించి రాజయ్య రాజీకి వచ్చినట్లు చెబుతున్నారు. కానీ, ముందస్తు సమాచారం తెలిసి ఫాం హౌజ్ కు వెల్లకుండా మధ్యలోనే వెనుదిరిగారు. అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన కేసీఆర్ సుధీర్ కుమార్ ను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు.

Latest News