Site icon vidhaatha

Warangal | ప్రభుత్వ భూమి ఆక్రమణ.. దర్జాగా విక్రయం! పబ్లిక్‌గా అమ్మకానికి పెట్టిన నెల్లికుదురు ZPTC

Warangal |

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఆయన ఓ ప్రజా ప్రతినిధి. మానుకోట జిల్లా నెల్లికుదురు జడ్పిటిసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి. అధికార పార్టీ అండ ఆ నియోజకవర్గ ముఖ్య ప్రజా ప్రతినిధికి అనుచరుడిగా గుర్తింపు ఉంది. ఇంకేముంది ప్రభుత్వ భూమిపై భాజాప్త కన్నేసి కబ్జా చేశారు. అక్కడికే ఆగకుండా ప్లాట్లుగా చేసి పబ్లిక్ గా అమ్మకానికి పెట్టారు.

ఇది ఇటీవల కాలంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్న సంఘటనకు ఒక ఉదాహరణగా స్థానికులు చెబుతున్నారు. అయితే స్థానిక తహసిల్దార్ ఫిర్యాదుతో అయ్యగారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సర్వే నెంబర్ 551/1,551/2 లోని ప్రభుత్వ భూములున్నాయి. ఇందులో సుమారు 2-17 ఎకరాల భూమిని మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని నెల్లికుదురు అధికార పార్టీ జెడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి మరి కొంతమందితో కలిసి ఆక్రమించి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు.

ఈ వ్యవహారంపై గత నెల 24న స్థానిక తహశీల్దార్ ఇమ్మాన్యూయల్ బీఆర్ ఎస్ జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డితో పాటు మరి కొంతమంది ప్రభుత్వ భూమిని అక్రమించారని ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మానుకోట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి సెక్షన్ 447, 427, 34ఐపీసీ, 3పిడీపీపీఏ కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయమై అధికార పార్టీ ముఖ్య నాయకులు ఎలా స్పందిస్తారోనని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

Exit mobile version