Warangal
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాబందుల చేతిలో రాష్ట్రం పడితే ఆగమైపోతాం అంటూ కాంగ్రెస్ ను ఉద్దేశించి రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ వచ్చి తమకు అధికారం ఇవ్వాలంటున్నారని, ఆరున్నర దశాబ్దాలు అధికారంలో ఉంది ఎవరంటూ ప్రశ్నించారు.
వరంగల్లో శనివారం సాయంత్రం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరై కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే తాగునీరు, సాగు నీళ్లు, కరెంట్, పథకాలు మాయ మైతాయన్నారు. 55 ఏండ్ల పాటు కరెంట్, నీళ్లు ఇవ్వని పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ విమర్శించారు. పెన్షన్ లేదు, కరెంటు ఇవ్వాలేని దద్దమ్మ పార్టీని, రాబందుల పార్టీని మళ్లీ నమ్ముదామా? ఆగమై పోదామా? అంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికారం కోరుతుందని మళ్ళీ గుండాలు, రౌడీలు రాజ్యమేలాలా? పంచాయతీలు ఫైటింగులు దొమ్మీలతో కొనసాగాలా? పచ్చని తెలంగాణ కావాలా? అంటూ ప్రశ్నించారు. పంచాయతీల తెలంగాణ కావాలంటే కాంగ్రెస్ ను కోరుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలు వింటే మళ్లీ మోసపోతామని, ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా జీవిస్తున్న తెలంగాణ, కోలుకోలేని దెబ్బతింటుందని హెచ్చరించారు.
బీఆర్ఎస్ పార్టీకి కులపిచ్చి, మత పిచ్చి లేదని, అభివృద్ధి సంక్షేమమే లక్ష్యమన్నారు. అభివృద్ధి సంక్షేమం చేశాం కాబట్టే దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తుంటే మీకేమి నొప్పి అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఆజంజాహి మిల్లు మూసివేస్తే బీఆర్ఎస్ హయంలో కలెక్టరేట్ కడుతున్నామని, 200 పెన్షన్ నుంచి 2000 రూపాయలు చెల్లిస్తున్నామని, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్తో పాటు అనేక సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు.
మోడీ ప్రియమైన ప్రధాన మంత్రి కాదు, పిరమైన ప్రధానమంత్రి అంటూ మంత్రి కేటీఆర్ విమర్శించారు. గ్యాస్ ధర, పెట్రోల్ ధర, పప్పు, ఉప్పు, నిత్యావసర ధరలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్ద నోట్ల రద్దుతో దేశానికి ఒరిగింది ఏమి లేదన్నారు. ఇప్పుడు 2000 రూపాయల నోట్లు రద్దు చేస్తారట ఏం చేస్తారో ఆయనకే తెలియదు అంటూ విమర్శించారు. 15 లక్షలు వేస్తామంటూ ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ పాలనలో దేశం ఆగమైందని, రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అన్నారు. వీటన్నింటికి భిన్నంగా రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి తెలంగాణ భారతదేశానికి దిక్సూచిగా మారిందని కొనియాడారు.
పనికి మాలిన ఆర్ధిక విధానాలతో మోడీ దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారన్నారు. విభజన హామీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఇప్పటికీ ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు తప్ప అమలు కాడికి వచ్చేసరికి వెనుకంజ వేస్తున్నారని విమర్శించారు.
నగరంలో రూ. 618 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి కేటీఆర్ వివరించారు.రాష్టంలో ప్రతి రంగంలో అభివృద్ధి జరుగుతుంది కాబట్టే ఉత్సవాలు జరుపుతున్నామని అన్నారు.
ప్రతి రంగంలో ప్రజలకు పథకాలు అందుతుంటే ప్రతిపక్షాలకు బాధ కలుగుతుందన్నారు. తెలంగాణలో ఎక్కడ లేని విధంగా పేదలకు 24 అంతస్తుల ఆసుపత్రి నిర్మిస్తున్న ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. గతంలో వరంగల్ లో పేరుకే ఐ టి మంత్రి ఉండే, కానీ ఒక్క ఐటి కంపెనీ రాలేదని విమర్శించారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు ను 6 నుండి 9 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టరేట్, 77 కోట్ల రూపాయలతో మూడున్నర ఎకరాలలో వరంగల్ బస్ స్టాండ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసినట్లు వివరించారు.
మమునూరు ఎయిర్ పోర్ట్ స్థలం ఇస్తాం అంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకుండుతుందని ఆరోపించారు.
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నాయకత్వంలో వరంగల్ అభివృద్ధిలో ముందుకు పోదామని మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్య మంత్రి ఆశీర్వాదం ఉంటే, తూర్పు ప్రజల దీవెనలు లభిస్తే నరేందర్ మళ్ళీ ఎమ్మెల్యే గా ముందుకు పోతారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అభ్యర్థిత్వం సూటిగా ప్రకటించకుండా ముఖ్యమంత్రి పేరుతో ట్విస్ట్ ఇచ్చారని చర్చ సాగుతోంది.
ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థిత్వంలో డైరెక్ట్ గా గెలిపించాలని కోరగా నన్నపనేని విషయంలో మాత్రం ముఖ్యమంత్రి పై నేపం మోపి కేటీఆర్ చాకచక్యంగా మాట్లాడారని అభిప్రాయం వ్యక్తం అయింది. పైగా వరంగల్ తూర్పు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మేయర్ గుండు సుధారాణి, శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, ఇతర కార్పొరేషన్ చైర్మన్ లను సభా వేదిక నుంచి పరిచయం చేయడం ఆసక్తికరంగా మారింది.
వరంగల్ ఆడబిడ్డగా గుండు సుధారాణి అభివృద్ధితో పాటుపడుతుందని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో పూర్వ వరంగల్ జిల్లాలో ఒక్క సీటు కూడా వదలకుండా గెలుస్తామని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. ఈ సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ మాలోతి కవిత పసునూరి దయాకర్ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, శంకర్ నాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టెక్స్టైల్ పార్కులో నూతన కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి దాటికి కొంతమంది నాయకులు నియోజకవర్గాలు మారి జంప్ అవుతున్నారు అంటూ సెటైర్ వేశారు. మీసాలు మెలితిప్పే నాయకులు పరకాలలో పోటీకి భయపడుతున్నారని విమర్శించారు. ఎవరిని ఉద్దేశించి తాను మాట్లాడుతున్నాను మీ అందరికీ తెలుసు అంటూ కొండా దంపతులను ఉద్దేశించి సెటైర్ వేశారు. హోండాగిరి చేస్తాం రౌడీయిజం చేస్తామంటే వినేటోడు ఇప్పుడు ఎవరూ లేరని తగిన బుద్ధి చెప్తారు అంటూ హెచ్చరించారు.