Warangal
- సర్వం కోల్పోయి.. స్మశాన నిశ్శబ్దం
- కంటనీరు పెడుతున్న గ్రామాలు
- ఒంటరిగా మిగిలిన కుటుంబాలు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరద విష కౌగిలిలో చిక్కిన ఆ రెండు పల్లెల్లో స్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. సర్వం మింగేసిన జలరాకాసి కీనీడలో బాధితులు గొల్లుమంటున్నారు. తమ రక్త సంబంధీకులను పోగొట్టుకుని ఒంటరిగా మారిన కుటుంబాలు కంటనీరు పెడుతున్నాయి.
భూపాలపల్లి జిల్లా మోరంచపల్లె, ములుగు జిల్లా కొండాయి గ్రామాలు గగ్గోలు పెడుతున్నాయి.
వాన పేరుచెప్పినా, వరద చూసినా ఈ రెండు పల్లెల జనం భయంతో వణికిపోతున్నారు. గురువారం రాత్రి సృష్టించిన కల్లోలాన్ని తలుచుకొని బోరున విలపిస్తున్నారు. నిన్నటి వరకు తమకున్నంతలో బతుకు సాగించిన పల్లెవాసుల జీవితాల్లో వర్షం కల్లోలం సృష్టంచింది.
మోరంచపల్లెలో ఘోరం
మోరంచపల్లె ప్రజల ఇండ్లతో పాటు వాళ్ళ సర్వస్వాన్ని వరద ఒక్క దెబ్బతో ఊడ్చేసింది. ఇండ్లలోని సామాన్లు, సరుకులు, పంట ధాన్యాలు, పశువులు, పెంపుడు జంతువులు, వస్తువులు అన్నీ వరదలో కొట్టుకపోయాయి. బలమైన ఇండ్లు కూడా వరద తాకిడికి దెబ్బతిన్నాయి. సాధారణ ఇండ్లు, పశువుల కొట్టాల వంటి వాటి పరిస్థితి చెప్పలేని దుస్థితి నెలకొంది. ఆకస్మికంగా వచ్చిన వరదతో ప్రజలు తెల్లారే వరకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు.
అధికార యంత్రాంగం ఎన్డీ ఆర్ ఎఫ్ టీములు, భూపాలపల్లి జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగి చేసిన ప్రయత్నాలతో ప్రాణాలతో బయటపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ స్పందనతో ఆఖరికి రెండు సైనిక హెలికాప్టర్ లు రంగంలోకి దిగాయి. చుట్టుముట్టిన వరద మధ్య ఇండ్ల మీద ఉన్న బాధితులను, నీటిలో ఉన్న వారిని రక్షించారు. అయినప్పటికీ ఈ గ్రామానికి చెందిన వారిలో నలుగురి ఆచూకీ ఇంకా లభ్యంకాలేదు.
వరద బీభత్సానికి ఈ గ్రామంలో మృతిచెందిన జంతువులను పూడ్చిపెట్టడం కూడా సమస్యగా మారిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. గ్రామాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గండ్ర సత్యనారాయణరావు తదితరులు సందర్శించి గ్రామస్థులను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ కుటుంబాలను ఆదుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
కన్నీటి సంద్రమైన కొండాయి
ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క జాతరకు సమీపంలోని కొండాయి గ్రామంలో దయనీయ పరిస్థితి నెలకొంది. ప్రశాంతంగా జీవించే అడవి పల్లె కన్నీటి సంద్రమైంది. పొంగిపొర్లిన జంపన్నవాగు ప్రవాహ దాటికి ఎనిమిది మంది గల్లంతయ్యారు. వారిని రక్షించేందుకు ఎన్డీ ఆర్ ఎఫ్ బృందం గురువారం రాత్రి చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో శుక్రవారం ఉదయానికి గల్లంతైన వారిలో నలుగురి మృతదేహాలను స్థానికులు పంట పొలాల్లో కనుగొన్నారు.
సాయంత్రం మరో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో ఎక్కడో ప్రాణాలతో ఉండకపోతారా? అనే ఆశతో ఉన్న గూడెం జనానికి తీవ్ర నిరాశ ఎదురైంది. తమ వారిని కోల్పోయిన కుటుంబాల రోదన మిన్నంటింది. ఇదిలా ఉండగా గురువారం కొండాయి వాసుల పరిస్థితి తెలిసిన స్థానిక ఎమ్మెల్యే ధనసరి సీతక్క పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. హెలికాప్టర్ ఏర్పాటు చేయాలని కోరారు.
అక్కడి వారి పరిస్థితి పై ఒక దశలో ఆమె కంటనీరు పెట్టిన విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం ఉదయం ఈ ప్రాంతానికి హెలికాప్టర్ పంపించి సహాయక చర్యలు చేపట్టారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత ములుగు ప్రాంతాన్ని సందర్శించి, సహాయక చర్యలు పరిశీలించారు.