బీసీలకు టికెట్లు ఇచ్చినే పార్టీలకే మద్దతు: ఆర్‌.కృష్ణయ్య

బీసీలకు టికెట్లు ఇచ్చిన పార్టీలకే ఎన్నికల్లో అండగా నిలుస్తామని, 15 లక్షల ఉద్యోగాల భర్తీకి సానుకూలంగా ఉన్న పార్టీలకే మద్దతు ఇస్తామని

  • Publish Date - March 23, 2024 / 02:33 PM IST

విధాత : బీసీలకు టికెట్లు ఇచ్చిన పార్టీలకే ఎన్నికల్లో అండగా నిలుస్తామని, 15 లక్షల ఉద్యోగాల భర్తీకి సానుకూలంగా ఉన్న పార్టీలకే మద్దతు ఇస్తామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య స్పష్టం చేశారు. జాతీయ బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన బీసీ జోడో యాత్రలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఫ్రభుత్వాలకు బీసీల అభివృద్దికి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించడానికి మనసు రావడం లేదని, ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తూ తీరని ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని, 50 శాతం ఎంపీ స్థానాలు కేటాయించాలని కోరారు. పార్లమెంటు ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు పది సీట్లు ఇవ్వాలని, బీసీ డిమాండ్లపై విధానపరమైన ప్రకటన చేసి తమ మ్యానిఫెస్టోలలో చేర్చాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో బీసీలకు తీరని అన్యాయం చేసిందని, సంపన్న వర్గాలకు పెద్ద పీటవేసిందని విమర్శించారు. విద్యార్థుల ఫీజు బకాయిలు, ఉపకార వేతనాల చెల్లింపులో రాష్ట్ర సర్కార్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, పేద, బలహీన వర్గాల విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గవ్వల భరత్‌కుమార్‌, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్‌, నందగోపాల్‌, రాజ్‌కుమార్‌, అంజి, ప్రవీణ్‌ముదిరాజ్‌, ఉదయ్‌, రోహిత్‌, నాగరాజు, లోకేష్‌ తదితరులు పాల్గొన్నారు.