విధాత: దేశంలోని అన్ని వర్గాలను కలుపుకుని భారత్ నిర్మాణానికి ముందడుగు వేయాలి. మంచి శుభారంభం లభించింది.. కచ్చితంగా విజయం సాధిస్తాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మార్పు తప్పకుండా వస్తుంది. వంచిత ప్రజలు, రైతులకు తమ హక్కులు లభిస్తాయని కేసీఆర్ పేర్కొన్నారు. ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ చేరిక సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.
దేశంలో 4 లక్షల మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థం ఉంది. దేశంలో ఇప్పటి వరకు 2.10 లక్షల మెగావాట్ల విద్యుత్ కంటే ఎక్కువ వాడలేదు. సాగునీరు, తాగునీరు ఇవ్వలేకపోతున్నాం. మన వద్ద వనరులు ఉన్నా.. అమెరికా వద్ద చేతులు చాచడం ఎందుకు? అమెరికాలో మన పిల్లలకు గ్రీన్ కార్డు వస్తే ఇక్కడ మనం దావత్ చేసుకుంటున్నాం అని కేసీఆర్ పేర్కొన్నారు.
నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యుడి జేబు గుల్ల చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కంపెనీల ప్రయివేటీకరణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నష్టాలేమో సామాన్యుడి నెత్తిన రుద్దుతున్నారు. లాభాలు వస్తే మాత్రం కార్పొరేట్లకు దోచి పెడుతున్నారు. దుర్భర పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పరిస్థితుల్లో మార్పు తీసుకు వచ్చేందుకే బీఆర్ఎస్ ఏర్పాటైంది. ఒడిశా నేతల చేరికతో నాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది అని కేసీఆర్ తెలిపారు.
WATCH LIVE: Odisha Ex CM Giridhar Gamang joining BRS in the presence of CM KCR at Telangana Bhavan https://t.co/JP2rY8Nkeu
— BRS Party (@BRSparty) January 27, 2023
దేశంలో సరిపడా నీళ్లున్నా పొలాలకు మళ్లవు.. సరిపడా కరెంట్ ఉన్నా చీకట్లు తొలగవు అని కేసీఆర్ పేర్కొన్నారు. సర్కార్లు మారుతుంటాయి.. నాయకులు మారుతుంటారు.. రైతుల తలరాతలు మారడం లేదు. ఎన్నికల్లో గెలవాల్సింది నాయకులు కాదు.. ప్రజలు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉంది.
ఎన్నికల్లో గెలవడమే నాయకుల లక్ష్యంగా మారింది. ఏదో ఒక రకంగా ఓట్లు సంపాదించుకోవడమే రివాజుగా మారింది. పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు కానీ.. తాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వరు. దేశ రాజధానిలో రైతులు 13 నెలలు ఉద్యమం చేశారు. ఇప్పటికీ రైతులకు ఒక భరోసా ఇవ్వలేకపోయింది కేంద్రం. అందుకే అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్ని బీఆర్ఎస్ ఎత్తుకున్నది అని తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించండి.. దేశంలో నీళ్లు, కరెంట్ ఎందుకు రావో నేను చూస్తాను అని కేసీఆర్ అన్నారు. మనసు పెట్టి పని చేస్తే ఏదైనా సాధ్యమే. తెలంగాణకు అందుకు సాక్ష్యం. తెలంగాణలో సాధ్యమైంది.. దేశమంతటా ఎందుకు సాధ్యం కాదు. తెలంగాణలో ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తున్నాం.. దేశమంతా ఎందుకు ఇవ్వలేం.
తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఆగిపోయాయి.. వలసలు వాపస్ వస్తున్నాయి. నేను చెప్పేది ధన్ కీ బాత్ కాదు.. మన్ కీ బాత్. కరెంట్‌కు దేశంలో కొదవ లేదు.. 4 లక్షల మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉంది. అన్ని ధరలు పెంచుకుంటూ పోవాలి.. జనం జేబులు కొట్టేయాలనేదే కేంద్రం యావ. పేదోడి కడుపు కొట్టాలి.. ఉన్నోడి జేబులు నింపాలి.. దేశంలో నడుస్తున్నది ఇదే అని కేసీఆర్ వివరించారు.