High Court | స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు..? ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన హైకోర్టు

High Court | వారం రోజుల్లో వివ‌రాలు తెలుపండి విధాత,హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికిప్పుడే ఎన్నికలు నిర్వహించాలని తాము చెప్పడం లేదని, ప్రక్రియ ఎప్పుడు ప్రారంభిస్తారో అన్నది చెప్పాలని వ్యాఖ్యానించింది. వారం రోజుల సమయం ఇస్తున్నామని.. ఈలోగా దీనిపై వివరాలు తెలియజేయాలని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ […]

  • Publish Date - July 29, 2023 / 03:48 AM IST

High Court |

వారం రోజుల్లో వివ‌రాలు తెలుపండి

విధాత,హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికిప్పుడే ఎన్నికలు నిర్వహించాలని తాము చెప్పడం లేదని, ప్రక్రియ ఎప్పుడు ప్రారంభిస్తారో అన్నది చెప్పాలని వ్యాఖ్యానించింది.

వారం రోజుల సమయం ఇస్తున్నామని.. ఈలోగా దీనిపై వివరాలు తెలియజేయాలని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్కర్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు.

సుదీర్ఘ ఖాళీల ఫలితంగా, పంచాయతీల పనితీరు దెబ్బతింటుందని, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా పొందే నిధులను సదరు గ్రామాలు కోల్పోతాయని పేర్కొన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.

రాష్ట్ర వ్యాప్తంగా 344 సర్పంచ్‌లు, 9 జడ్పీటీసీలు, 300 ఉప్ప సర్పంచ్‌లు, 5,329 వార్డు సభ్యులు స్థానాలు ఖాలీగా ఉన్నాయని పిటిషన్‌ తరఫు న్యాయవాది చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడంటే అప్పుడు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని ఈసీ కౌన్సిల్‌ పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ నిర్ణయం ఏంటో తెలియజేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది.

Latest News