విధాత: తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో పోసగ లేకపోతున్న సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భవిష్యత్ రాజకీయాల దిశగా ఎటువైపు అడుగులేస్తున్నారన్న దానిపై ఆ పార్టీ కేడర్ తో పాటు అనుచర వర్గాల్లో తీవ్ర అయోమయం రేపుతుంది.
రేవంత్ సారథ్యంలో పని చేయలేక కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న వెంకట్‌రెడ్డి మొన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడంతో ఆయన పార్టీలో కొనసాగుతారని కాంగ్రెస్ శ్రేణులు అనుచర వర్గాలు భావించాయి. ఇంతలోనే ప్రధాని మోదీతో రేపు శుక్రవారం ఉదయం 11 గంటలకు వెంకట్‌రెడ్డి భేటీ అవుతుండడం కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
నియోజకవర్గ అభివృద్ధి పనుల చర్చ కోసమే..
తన పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం, మూసీ నది ప్రక్షాళన, ఎంఎంటీఎస్ రైలు పొడిగింపు, రహదారుల విస్తరణ పనులపై చర్చించేందుకు వెంకట్ రెడ్డి ప్రధాని మోదీతో చర్చిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ కార్యక్రమాలకు అంటిముంటనట్లుగా ఉంటున్న వెంకట్‌రెడ్డి తన తమ్ముడి బాటలోనే బీజేపీలో చేరే విషయమై ప్రధానితో చర్చించబోతున్నారన్న ప్రచారం సైతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది.
వెంకట్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అయిన 48 గంటల్లోనే ప్రధాని మోదీతో భేటీ అవుతుండడంతో ఆయన పార్టీ మారుతున్నారన్న ఊహగానాలకు బలం చేకూరుస్తుంది. ఖర్గేతో భేటీలో వెంకట్ రెడ్డి టి.కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలతో పార్టీ నష్టపోతుందని, తన లాంటి సీనియర్లంతా అసంతృప్తితో ఉన్నారని ఫిర్యాదు చేశారు.
ఖర్గే ఎదుట రాష్ట్ర సమస్యల వివరణ
తాజాగా ప్రకటించిన టీ.కాంగ్రెస్ కార్యవర్గ.. రాజకీయ వ్యవహారాలలో కమిటీల్లో తనను, తన వర్గాన్ని దూరం పెట్టారని, కమిటీల కూర్పు పట్ల పార్టీలో అంతర్గతంగా తీవ్ర అసమ్మతి నెలకొందని, రేవంత్ నాయకత్వం నచ్చక ఇప్పటికే మర్రి శశిధర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి వంటి సీనియర్లు పార్టీని వీడిపోయారని ఖర్గేకు వెంకట రెడ్డి ఏకరవు పెట్టారు.
వెంకట్‌రెడ్డి వాదన విన్న ఖర్గే భవిష్యత్తులో జాతీయస్థాయిలో మంచి స్థానం కల్పిస్తానని, పార్టీ వీడనవసరం లేదంటూ సర్ది చెప్పారు. దీంతో ఇక వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతారని కాంగ్రెస్ శ్రేణులు సమాధాన పడ్డారని అనుకునేలోపునే రేపు శుక్రవారం ప్రధాని మోదీతో వెంకటరెడ్డి భేటీకి అపాయింట్మెంట్ తీసుకోవడం మళ్లీ కాంగ్రెస్ వర్గాలను, ఆయన అనుచరులను అయోమయంలో పడేసింది.
పీఎంతో భేటీ దేని కోసం..
ప్రధాని మోదీతో భేటీలో వెంకట్‌రెడ్డి తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనుల పై చర్చిస్తారా లేక తను బీజేపీలో చేరే విషయమై చర్చలు సాగించనున్నారా అన్నదానిపై ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ వర్గాలతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లోనూ చర్చోప చర్చలు సాగుతున్నాయి.
ఇటీవల వెంకట్ రెడ్డి నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు నెల రోజుల ముందు తన రాజకీయ భవిష్యత్తుపై మాట్లాడుతానని, మళ్లీ నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్‌లోనే పోటీ చేస్తానని చెప్పారు. ఢీల్లీలో మీడియా చిట్ చాట్ లో వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి పదవితో పాటు అన్ని పెద్ద పదవులు అనుభవిం చానని, పార్టీ మారడం కంటే రాజకీయాల నుంచి వైదొలగడమే మేలంటూ మరొకసారి పొంతన లేని ప్రకటనలు చేశారు.
ఈ తీరుతో వెంకట్ రెడ్డి వైఖరి రాజకీయంగా ఆయనలోని అనిశ్చిత వైఖరికి నిదర్శనంగా కనిపిస్తుంది. అంతేకాదు వెంకట్‌రెడ్డి రాజకీయంగా ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో నన్న భావన అనుచర వర్గాల్లో వ్యక్తం అవుతుండడంతో ప్రధాని మోదీతో ఆయన భేటీ పార్టీ మార్పుపై చర్చకు తెర లేపింది.
కోమటిరెడ్డి వైపు బీజేపీ చూపు
ముఖ్యంగా సీఎం కేసీఆర్‌కు బీజేపీకి మధ్య రాజకీయ యుద్ధం తీవ్రమైన నేపథ్యంలో తెలంగాణలో ఎలాగైనా రాజకీయంగా బలపడి అధికార పీఠం ఎక్కాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ వెంకట్‌రెడ్డిని పార్టీలోకి చేర్చుకునే విషయమై కూడా సీరియస్‌గానే ఆలోచన చేస్తుందనడంలో సందేహం లేదు. ఉమ్మడి నల్గొండ లో బీజేపీకి బలమైన నాయకులు లేని లోటు కూడా వెంకట్ రెడ్డి వైపు బీజేపీ అధిష్టానాన్ని చూసేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో వెంకట్‌రెడ్డి భేటీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
జట్టుగా వెళ్లేందుకు వెంకట్‌రెడ్డి యత్నాలు
కాంగ్రెస్ పార్టీని వీడి తాను బీజేపీలో చేరితే తానొక్కడినే కాకుండా టీ.కాంగ్రెస్‌లో రేవంత్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మరికొందరు కాంగ్రెస్ సీనియర్లను సైతం ఒప్పించి వారితో కలిసి బీజేపీలో చేరేందుకు వెంకట్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్న వాదన కాంగ్రెస్ వర్గాల్లో అంతర్గతంగా జోరు అందుకుంది.
తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినప్పటి నుండి కాంగ్రెస్ లో వెంకటరెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. రేవంత్ వర్గం ఈ అంశాన్ని ఆసరాగా చేసుకొని ఢిల్లీ హైకమాండ్ వద్ద తనను పలచన చేస్తున్న ప్రయత్నాలతో పాటు రాష్ట్ర పార్టీ నూతన కమిటీల్లో తనను పక్కన పెట్టడం వెంకటరెడ్డికి మింగుడు పడనదిగా మారింది.
రేవంత్ తీరుతోనేనా..
రేవంత్ తన పట్ల వ్యవహరిస్తున్న తీరు పొమ్మనలేక పొగ పెట్టిన చందంగా ఉండగా.. ఇలాగే పార్టీలో కొనసాగితే రాజకీయ ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితులు ఉండడంతో తమ్ముడు బాటలో బీజేపీలో చేరే విషయమై కూడా వెంకట్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్లుగా అనుచర వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీతో కోమటిరెడ్డి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
వెంకట్‌రెడ్డితో కలిసి వెళ్లే వారెవరు?
అసలు వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరితే ఆయన వెంట ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వెళ్లే కాంగ్రెస్ నాయకులు ఎవరన్న దానితో పాటు రాష్ట్రస్థాయి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరెవరు ఆయనతో పాటు బీజేపీలోకి అడుగులేస్తారన్న విషయం కూడా ఆసక్తికరంగా మారింది.
దామోదర రాజనర్సింహ, విహెచ్, జగ్గారెడ్డి, కొండ సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నాల సహా పలువురు సీనియర్లు తరచూ రేవంత్ తీరుపై అసంతృప్తితో ఉన్నప్పటికీ ఇన్నాళ్లుగా పనిచేసిన కాంగ్రెస్‌ను వీడి వెంకటరెడ్డి వెంట బీజేపీకి చేరడం కష్ట సాధ్యంగానే కనిపిస్తుంది. అయితే వెంకటరెడ్డి అసలు పార్టీ మారుతారా.. మారితే తన వెంట ఎంతమంది కాంగ్రెస్ సీనియర్లను,అసమ్మతి వాదులను ఒప్పించి తన వెంట బీజేపీలోకి తీసుకెళ్లడంలో సఫలీకృతం అవుతారో వేచి చూడవలసి ఉంది.