విధాత: మానవ అక్రమ రవాణా (Human Trafficking) కు పాల్పడుతున్నారన్న అనుమానంతో 303 మంది భారతీయులున్న విమానాన్ని ఫ్రాన్స్ (France) వెట్రీ విమానాశ్రయంలో నాలుగు రోజుల పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఎయిర్ ఏ340 శ్రేణికి చెందిన ఈ విమానాన్ని కొంతమంది అద్దెకు తీసుకుని 276 మందిని దుబాయ్ నుంచి నికరాగ్వాకు తీసుకెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వీరిలో 25 మంది ఫ్రాన్స్‌లో శరణార్థులుగా ఉండిపోవడానికి నిశ్చయించుకోగా మిగతా వారిని భారత్‌కు ఫ్రాన్స్ అధికారులు పంపేశారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పుడు పట్టుబడిన నికరాగ్వా విమానంలో ఉన్న వారిలో 96 మంది గుజరాతీయులే. ఇందులో ఉన్నవారిని నికరాగ్వాకు అక్కడి నుంచి అక్రమంగా అమెరికాకు తరలించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. దీనిని ఇటీవల షారుక్ ఖాన్ హీరో రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో వచ్చిన డంకీ సినిమా కథతో పోలుస్తున్నారు. అక్రమ మార్గాల్లో చట్టవిరుద్ధంగా విదేశాలకు వెళ్లే వారి కథే డంకీ.
తాజాగా జరిగిన ఘటన వెనుక హైదరాబాద్ (Hyderabad) కు చెందిన శశి కిరణ్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది. ఈయనే తాజా రియల్ డంకీ కథకు మాస్టర్‌మైండ్ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. గత ఏడాది కెనడా సరిహద్దుల నుంచి అమెరికా సరిహద్దుల్లోకి ప్రవేశిస్తూ ఇద్దరు చిన్నారులు సహా ఓ గుజరాతీ కుటుంబం చలికి గడ్డకట్టి చనిపోయిన విషయం తెలిసిందే. దింగూచా ఘటనగా పిలిచే ఆ కేసులోనూ శశి కిరణ్ రెడ్డే కీలక వ్యక్తి అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
అయితే సరైన సాక్ష్యాధారాలను సేకరించడంలో గుజరాత్ పోలీసులు విఫలం కావడంతో శశిని వారు అదుపులోకి తీసుకోలేకపోయారు. గత రెండు నెలల్లో శశి కనీసం 800 మందిని అక్రమ మార్గాల్లో నికరాగ్వాకు పర్యాటకుల పేరు మీద పంపించాడని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ‘ఇంతకుముందు శశి 50 సీటర్ల విమానాలు బుక్ చేసి భారతీయులను తరలించేవాడు. కిందటి సారి ఇలాంటి విమానానికి తాము అనుమతి ఇవ్వలేమని ఫ్రాన్స్‌లోని వెట్రీ విమానాశ్రయం అధికారులు తెలిపారు.
దీంతో 300 మంది సామర్థ్యం ఉండే ఏ340 విమానాన్ని బుక్ చేశాడు. దీన్ని అనుమతించి రీఫ్యూయల్ చేస్తారనిన శశి భావించాడు’ అని ఈ ఘటనతో పరిచయమున్న వ్యక్తి ఒకరు వెల్లడించారు. ఇటీవలి కాలంలో కెనడా, మెక్సికో సరిహద్దుల నుంచి అమెరికాలోకి ప్రవేశించడం కష్టంగా మారడంతో నికరాగ్వా నుంచి పంపించడానికి ఈ ముఠాలు ప్రయత్నిస్తున్నాయి.