ప్రభుత్వ వ్యతిరేకతను బీఆరెస్‌ అధిగమిస్తుందా?

సరిగ్గా మూడు రోజుల్లో తెలంగాణ తన భావి ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నది. మూడోసారి వరుసగా గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని బీఆరెస్‌ ప్రయత్నాలు చేస్తుంటే.. మూడోసారైనా గెలవాలని కాంగ్రెస్‌ చమటోడ్చుతున్నది

  • Publish Date - November 27, 2023 / 11:31 AM IST
  • పలువురు సిటింగ్‌లపై వ్యతిరేకత
  • దళితబంధు అమలులో జాప్యం
  • అన్ని పథకాలూ బీఆరెస్‌ కార్యకర్తలకే వెళుతున్నాయంటున్న పేద ప్రజలు
  • 5 శాతం ఐఆర్‌పై ఉద్యోగుల్లో ఆగ్రహం
  • ఏ పథకాలకూ నోచని మధ్యతరగతి
  • ఇబ్బందిగా ‘ఫాంహౌస్‌ సీఎం’ అపప్రథ
  • కుటుంబపాలనపై విపక్షం విమర్శలు
  • బలమైన ప్రత్యర్థిగా మారిన కాంగ్రెస్‌
  • బీఆరెస్‌ను ఓడించే శక్తి ఉందా?


హైదరాబాద్‌ : సరిగ్గా మూడు రోజుల్లో తెలంగాణ తన భావి ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నది. మూడోసారి వరుసగా గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని బీఆరెస్‌ ప్రయత్నాలు చేస్తుంటే.. మూడోసారైనా గెలవాలని కాంగ్రెస్‌ చమటోడ్చుతున్నది. బీజేపీ బరిలో ఉన్నా.. అది ఓట్లు చీల్చడమే తప్పించి.. అధికారంలోకి వచ్చేంత పరిస్థితి కనిపించడం లేదు. అయితే.. బీఆరెస్‌కు కాంగ్రెస్‌ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నా.. బలమైన ప్రభుత్వ వ్యతిరేకత అనే అతిపెద్ద ప్రమాదాన్ని కూడా ఎదుర్కొంటున్నది. ఇందులో పలువురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత అనేది ఒక సమస్యగా ఉంటే.. కేసీఆర్‌ కుటుంబ పాలన అనేది మరో కీలకమైన అంశంగా కనిపిస్తున్నది.


ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఉండగా.. ఆయన కుమారుడు కేటీఆర్‌ మంత్రిగా ఉన్నారు. కేసీఆర్‌ మేనల్లుడు హరీశ్‌రావు సైతం క్యాబినెట్‌లో ఉన్నారు. ఇక ఆయన కుమార్తె కవిత గతంలో ఎంపీగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సంతోష్‌కుమార్‌ సైతం కేసీఆర్‌ కుటుంబ సభ్యుడే. ఈ కుటుంబం మొత్తం దోచుకుంటున్నారనేది కాంగ్రెస్‌, బీజేపీ ఆరోపణ. ఇందులోనూ ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు తాజాగా ముందుకు వచ్చింది. మేడిగడ్డ బరాజ్‌ కుంగడం సంచలనం రేపడమే కాదు.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి భారీ స్థాయిలో జరిగిందన్న కాంగ్రెస్‌ ఆరోపణలకు బలం చేకూరినట్టయింది.


బీఆరెస్‌ కోటల్లోకీ కాంగ్రెస్‌


వాస్తవానికి మొదట్లో కాంగ్రెస్‌ ప్రభావం అనేది ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలకే పరిమితమైంది. కానీ.. తదుపరి కాలంలో బీఆరెస్‌కు బలమైన జిల్లాలైన కరీంనగర్‌, వరంగల్‌ వంటి చోట్ల కూడా విస్తరించింది. పాలకుర్తిలో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకగాంధీ సభకు హాజరైన ప్రజలే ఇందుకు నిదర్శనంగా రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. దాదాపు 30 నుంచి 40 మంది వరకూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.


 


నిజానికి సిటింగ్‌లందరికీ ఈసారి కూడా టికెట్లు వస్తాయని ముందు నుంచీ కేసీఆర్‌ చెబుతూ వచ్చారు. ఆ విధంగానే కొందరు మినహా అందరికీ టికెట్లు లభించాయి. కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నదని తెలిసి కూడా కేసీఆర్‌ వారికే టికెట్లు ఇవ్వడం ద్వారా సాహసమే చేశారనే అభిప్రాయాలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి. సిటింగ్‌లను మార్చితే ప్రత్యర్థి పార్టీల్లోకి వెళతారనే అభిప్రాయం ఇందుకు కారణం అయి ఉండొచ్చని అంటున్నారు.


పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆరెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత 30 లేదా 40 నియోజకవర్గాలకే పరిమితం అవుతుందా? లేక మరింత పెరుగుతుందా? అనే అంశంలో జోరుగానే చర్చలు సాగుతున్నాయి. సిటింగ్‌ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇవ్వొద్దని తాము కోరినప్పటికీ తమ అధినేత నిరాకరించారని ఒక టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.


ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో పలువురు పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడ్డారని, డబ్బు కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతకు కారణమవుతున్న మరో అంశం ధరణి పోర్టల్‌. భూ రికార్డులన్నింటినీ కంప్యూటర్లలోకి ఎక్కించి, రైతులకే భూమిపై పూర్తి హక్కు ఇచ్చామని బీఆరెస్‌ చెబుతున్నప్పటికీ.. అందులో ఉన్న సమస్యలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో అనేక కోర్టు కేసులు నడుస్తున్నాయి.


రగిలిపోతున్న నిరుద్యోగులు


తెలంగాణ రాష్ట్ర సాధన సమరంలో విద్యార్థుల పాత్ర ఎనలేనిది. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసుకున్నవారిలో ఎక్కువ మంది విద్యార్థులు, నిరుద్యోగులే ఉన్నారు. తమ చావుతోనైనా తెలంగాణ సాకారమై.. తమ తర్వాతివాళ్లైన ఉద్యోగాలు చేసుకుంటారన్న భావనతో వారు ప్రాణత్యాగానికి తెగించారు. కానీ.. ఆ ఆశలు నెరవేరలేదని నిరుద్యోగులు అంటున్నారు.


ఉద్యోగాల భర్తీ లేకపోవడం, టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్ష పత్రాల లీకేజీ అంశాలు, పదే పదే పరీక్షలు వాయిదా పడటం నిరుద్యోగులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. లక్షల మంది నిరుద్యోగులు హైదరాబాద్‌లో కిరాయికి ఉంటూ డబ్బులు ఖర్చు పెట్టుకుని కోచింగ్‌ సెంటర్లకు హాజరై పరీక్షలకు సన్నద్ధమైనా.. చివరి నిమిషంలో పరీక్షలు వాయిదా పడటంతో ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు.


బర్రెలక్కగా సామాజిక మాధ్యమాల్లో ప్రఖ్యాతి పొందిన శిరీష అనే నిరుద్యోగ యువతి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఏకంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆమెకు నిరుద్యోగుల నుంచి విశేష స్థాయిలో మద్దతు అందుతున్నది. నిరుద్యోగుల్లో రాజుకున్న ఈ అసహనం బీఆరెస్‌ ఎన్నికల ప్రయోజనాలను దెబ్బతీయడం ఖాయమని అర్థమయ్యే ఇటీవల మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌లో నిరుద్యోగ పరీక్షార్థులు ఎక్కువగా ఉండే అశోక్‌నగర్‌కు వెళ్లి.. వారితో సమావేశమయ్యారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.


రైతులు, ఇతర పేద ప్రజల్లోనూ ఇటువంటి వ్యతిరేకతే ఉన్నది. ఇక ఉద్యోగుల సంగతి సరేసరి. పీఆర్సీ అమలు చేయకపోవడం, మధ్యంతర భృతిని కేవలం 5శాతం ఇవ్వడం, డీఏ బకాయిలు చెల్లించకపోవడం, మెడికల్‌ బిల్లుల రీయింబర్స్‌మెంట్‌ లేకపోవడం, జీపీఎఫ్‌ చెల్లింపులు లేకపోవడంతో వారు సైతం ప్రభుత్వంపై గుర్రుమంటున్నారు. రుణమాఫీ సైతం అదే తరహాలో ఉన్నది.


 


ఇక రైతుబంధు జనవరిలో ఇవ్వాల్సి ఉన్నా.. ఎన్నికల వేళ ఇచ్చేందుకు ప్లాన్‌ చేసుకున్నారు. కానీ.. అది కాస్తా వెనక్కుపోయింది. ఇక డబుల్‌బెడ్‌రూం ఇళ్లు బీఆరెస్‌ కార్యకర్తలకే ఇస్తున్నారని జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వివిధ రకాల బంధులు సైతం వాళ్ల పార్టీ వాళ్లకే ఇచ్చుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇవి బీఆరెస్‌ విజయాన్ని ప్రభావితం చేసే అంశాలేనని బీఆరెస్‌ శ్రేణులు సైతం అంగీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది.


ఫాంహౌస్‌ సీఎం విమర్శలతో తలనొప్పి


ముఖ్యమంత్రి ఎన్నడూ సెక్రటేరియట్‌కు రారని, ఎప్పుడూ ప్రగతిభవన్‌కు లేదా ఫౌంహౌస్‌కు పరిమితమవుతారనే విమర్శ జనంలోకి బలంగా వెళ్లింది. సీఎం కోరుకున్నవారికి మాత్రమే ఆయనను కలిసే అవకాశం వస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నది. ప్రధాని మోదీ సైతం ఫాంహౌస్‌ సీఎం మనకు అవసరమా? అని ప్రచార సభల్లో ప్రశ్నిస్తున్నారు.


రాష్ట్రంలో పాలన అద్భుతంగా సాగుతున్నప్పుడు కేసీఆర్‌ ప్రజలను కలవాల్సిన అవసరమేంటని మంత్రులు సమర్థించుకుంటున్నా.. సీఎం జనానికి అందుబాటులో ఉండనే అభిప్రాయం మాత్రం ఉన్నది. అదే సమయంలో తప్పని పరిస్థితుల్లో బీఆరెస్ సైతం ప్రజా దర్బార్‌లు నిర్వహిస్తామని ఎన్నికల్లో చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదంటే.. ఈ అంశాన్ని అధికార పార్టీ అంత తేలిగ్గా కొట్టిపారేయడం లేదని అర్థం చేసుకోవాలని విశ్లేషకులు అంటున్నారు.


పెరిగిన కాంగ్రెస్‌ గ్రాఫ్‌.. బీఆరెస్‌ను ఓడించగలదా?


నిజానికి బీఆరెస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకువచ్చింది. మొదటి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌తో ఘన విజయం సాధించిన బీఆరెస్‌.. రెండో ఎన్నికల నాటికి సంక్షేమ పథకాలను నమ్ముకుని బయటపడింది. ఇప్పుడు మూడోసారి సెంటిమెంట్‌ గట్టెక్కించే అవకాశాలు లేకపోవడంతో కాంగ్రెస్‌పై దాడిని కేంద్రీకరిస్తూ.. బీఆరెస్‌ ఓడిపోతే.. పదేళ్ల శ్రమ మొత్తం వృథా అవుతుందని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నది.


 


అయితే.. ఐదారు నెలల వ్యవధిలో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ అనూహ్యంగా పెరిగింది. 95 నుంచి 100 సీట్ల మధ్య గెలుస్తామని బీఆరెస్‌ అధినేత ప్రకటించినా.. అది అంత సులభం కాదన్న వాతావరణం నెలకొన్నది. బీఆరెస్‌ గెలుపు ఖాయం అని పక్కాగా చెప్పే పరిస్థితి కనిపించం లేదని అంటున్నారు. కాంగ్రెస్‌ గాలి విస్తున్నప్పటికీ.. అది బీఆరెస్‌ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓటింగ్‌ కోటను బద్దలు కొట్టగలదా? అనేదే ప్రశ్న.