Bihar | ఓ ఇద్దరు వ్యక్తులు మహిళ పట్ల క్రూరంగా ప్రవర్తించారు. తీసుకున్న అప్పు చెల్లించలేదని, ఆమెను అతి కిరాతకంగా నరికి చంపారు. పట్టపగలే అందరూ చూస్తుండగా.. రొమ్ములు, చెవులతో పాటు చేతులను నరికేశారు. ఈ మూడు భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ దారుణ ఘటన బీహార్‌లోని భగల్‌పూర్ జిల్లాలో శనివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. నీలం అనే మహిళ తన బిడ్డ వివాహం నిమిత్తం షకీల్ మియాన్ వద్ద అప్పు తీసుకుంది. అయితే అప్పును ఆమె అనుకున్న సమయానికి చెల్లించలేదు. దీంతో ప్రతి రోజు నీలం ఇంటికి మియాన్ వెళ్లి అప్పు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు. అయితే శనివారం అత్యంత రద్దీగా ఉన్న మార్కెట్‌లో నీలంను షకీల్ మియాన్ అడ్డగించాడు. షకీల్ మియాన్, జుద్దీన్ మియాన్ కలిసి ఆమెపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. రొమ్ములు, చెవులతో పాటు చేతులను ముక్కలు ముక్కలుగా నరికేశారు.
నీలంపై దాడిని ఎవరూ అడ్డుకోలేదు. ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లిన వెంటనే దుండగులు అక్కడ్నుంచి పారిపోయారు. స్థానికులు ఆమె దగ్గరకు వెళ్లి దాడికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అయితే తనపై దాడి చేసింది షకీల్, జుద్దీన్ అని చెప్పింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని చికిత్స నిమిత్తం జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ హాస్పిటల్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు మియాన్, జుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.