విధాత: తనను కారు ఎక్కించుకున్న ఉబెర్ (Uber) డ్రైవర్.. కిడ్నాప్ చేశాడేమోనని భావించిన మహిళ అతడిని తుపాకీతో కాల్చిన ఘటన అమెరికా (America) లో చోటు చేసకుంది. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్ర గాయాలపాలవగా నిందితురాలిపై పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. జూన్ 16న జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం.. ఫోబే కోపాస్ (46) అనే మహిళ.. తన ప్రియుడిని కలసుకోవడానికి టెక్సాస్‌లోని క్యాసినోకు వెళ్లడానికి ఉబెర్‌ని బుక్ చేసుకుంది.
డానియల్ పియెడ్రా గార్సియా (52) డ్రైవర్‌గా రాగా కారు ఎక్కి ప్రయాణం ప్రారంభించింది. అయితే కోపాస్‌కు దారిలో మెక్సికో నగరం జువారెజ్‌కి దారి అన్న బోర్డు కనపడింది. దీంతో తనను డ్రైవర్ అపహరించి మెక్సికో (Mexico) తీసకెళ్లిపోతున్నారని పొరపడి తన హ్యాండ్‌బ్యాగ్ లోంచి రివాల్వర్‌ని తీసి డ్రైవర్ తలకు గురిపెట్టి కాల్చేసింది.
దీంతో కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. కారు నుంచి సురక్షితంగా బయటకొచ్చిన కోపస్ తన ప్రియుడికి ఈ వివరాలు మొత్తం చెప్పింది. అనంతరం తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడంతో డానియెల్‌ను తుపాకీతో కాల్చానని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు.. డానియెల్ ఏ కిడ్నాప్‌నకూ యత్నించలేదని నిర్దారించారు. ఉబెర్ యాప్ చూపించిన మ్యాప్ మార్గంలోనే అతడు వెళుతున్నాడని గుర్తించారు.
దీంతో కోపాస్‌పై హత్యా నేరం కింద కేసు పెట్టి కోర్టులో ప్రవేశపెట్టగా… ఆవిడకు 15 లక్షల డాలర్ల జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది. ఈ ఘటనపై ఉబెర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇక ఆ మహిళ తన జీవిత కాలంలో ఉబెర్‌లో ప్రయాణించకుండా నిషేధం విధించామని తెలిపింది. మరోవైపు డానియేల్ అత్యవసర విభాగం నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.