Site icon vidhaatha

చెత్త‌కుప్ప‌లో దొరికిన శిశువుకు సగం ఆస్తి.. పెద్ద మ‌న‌సు చాటుకున్న మ‌హిళ‌

విధాత‌: అప్పుడే పుట్టిన ఓ శిశువు చెత్త కుప్ప‌లో దొరికితే ఏం చేస్తాం. సాధార‌ణంగా పోలీసుల‌కు స‌మాచారం అందిస్తాం. లేదంటే అంబులెన్స్‌కు స‌మాచారం అందించి, ఏదో ఒక ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తాం. కానీ ఓ మ‌హిళ మాత్రం చెత్తకుప్ప‌లో దొరికిన శిశువును అక్కున చేర్చుకుంది. అంతే కాదు.. త‌న మొత్తం ఆస్తిలో స‌గం వాటాను ఇచ్చేందుకు పెద్ద మ‌న‌సుతో ముందుకు వ‌చ్చింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అలీగ‌ఢ్ జిల్లా స్వ‌ర్ణ‌జ‌యంతి న‌గ‌ర్‌కు చెందిన ల‌త అనే పాల పాకెట్ కోస‌మని సోమ‌వారం ఉద‌యం త‌న ఇంటి నుంచి బ‌య‌ల్దేరింది. రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తుండ‌గా, స్థానికంగా ఉన్న ఓ చెత్త కుప్ప‌లో శిశువు ఏడుపు వినిపించింది. దీంతో ఆమె అప్ర‌మ‌త్త‌మై ద‌గ్గ‌రికి వెళ్లి చూడ‌గా, న‌వ‌జాత శిశువు క‌నిపించింది.

ఒక్క క్ష‌ణం కూడా ఆవిడ ఆలోచించ‌కుండా.. ఆ ప‌సిపాప‌ను త‌న చేతుల్లోకి తీసుకుంది. అనంత‌రం పాప త‌ల్లిదండ్రుల ఆచూకీ కోసం చుట్టుప‌క్క‌ల వారంద‌రినీ ఆరా తీసింది. ఆ శిశువు గురించి త‌మ‌కు తెలియ‌ద‌ని చెప్ప‌డంతో.. ఇక త‌న ఇంటికి పాప‌ను తీసుకెళ్లింది. ఆ శిశువుకు స్నానం చేయించి పాలు ప‌ట్టింది.

ఈ పాప‌ను ద‌త్త‌త తీసుకుంటున్నాన‌ని, త‌న మొత్తం ఆస్తిలో స‌గం వాటాను ఆ పాప పేరు మీద రాసిస్తున్న‌ట్లు ల‌త ప్ర‌క‌టించింది. ఈ విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు ల‌త‌ను అభినందించి, ప్ర‌శంసించారు. చిన్నారి విష‌యం పోలీసుల‌కు తెలియ‌డంతో వారు చైల్డ్ హెల్ప్‌లైన్‌కు స‌మాచారం అందించారు.

Exit mobile version