విధాత, బ్యూరో మెదక్ ఉమ్మడి జిల్లా: సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని కాన్ఫరెన్స్ గదిలో సిద్దిపేట, హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మన ఊరు మన బడి పథకం కింద పాఠశాలలో జరుగుతున్న పనులపై మునిసిపల్ కమిషనర్లు, ఎంఈవోలు, ఇంజినీరింగ్ విభాగం ఈఈ, డిఈ, ఎఈలు, కౌన్సిలర్లు, నిర్మాణ ఏజెన్సీలతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశం లో కలెక్టర్ మాట్లాడుతూ మన ఊరు మన బడి పథకం లో ఎలక్ట్రిసిటీ, తాగునీటి వసతి, మేజర్, మైనర్ రిపేర్లు, టాయిలెట్లు, కిచెన్ షెడ్, ప్రహరీ గోడ, డైనింగ్ హల్, అదనపు తరగతి గదులు ఇతర పనులు ఉన్నాయన్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలల పనులు వేగంగా జరిగేలా చూడాలని మున్సిపల్ కమిషనర్, ఎంఈవో కి తెలిపారు.
ఇసుక కొరత ఉందని కాంట్రాక్టర్ లు అడగ్గా స్థానిక ఆర్డిఓకి చెప్పి.. సమస్య పరిష్కరిస్తానని హామి ఇచ్చారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలో మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి అన్ని పాఠశాలలను విజిట్ చెయ్యాలన్నారు. పాఠశాలల్లో డబ్బులు మిగులు ఉంటే వేరే పనులకు వాడుకోవాలని సూచించారు.
పాఠశాల పేరుకు స్టీల్ తో చేసిన అక్షరాలను వాడాలని, ఇప్పటి వరకు అయిన పనులకు ఎప్టిఓ జనరేట్ చెయ్యాలన్నారు. కౌన్సిలర్ లు కుడా ప్రతి 2రోజులకు పాఠశాలల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించాలన్నారు. డిసెంబరు చివర నాటికి అన్ని పనులు పూర్తి చేసి రాష్ట్ర మంత్రి హరీష్ రావు తో ప్రారంభం చెయ్యడానికి సిద్ధం చెయ్యాలని అధికారులను ఆదేశించారు.
అందరు ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ ఏజెన్సీలు పనులు పూర్తి అయిన తర్వాత పాఠశాల లోపల కాని బయట మైదానంలో కాని ఎలాంటి చెత్త, చెదారం, పాత సామాను, రాళ్ళు, రప్పలు లాంటివి ఎలాంటివి ఉండకూండా శుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో డిఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఆర్&బి ఈఈ సుదర్శన్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.