ఈడీ నోటీసులపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేస్తా: ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి

విధదాత,హైదరాబాద్‌: బీజేపీ కుట్రలను బయటపెట్టినందుకే తనకు ఈడీ నోటీసులు జారీ చేసిందని, ఈ నోటీసులపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణభవన్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. బీజేపీ జాతీయ నాయకులు సిట్‌ నోటీసులు వెళ్లడంతో తనను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని రోహిత్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారడాన్ని భరించలేక చేతుల్లో ఉన్న దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రయోగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ పంపిన నోటీసుల్లో ఏ […]

  • Publish Date - December 25, 2022 / 12:33 PM IST

విధదాత,హైదరాబాద్‌: బీజేపీ కుట్రలను బయటపెట్టినందుకే తనకు ఈడీ నోటీసులు జారీ చేసిందని, ఈ నోటీసులపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణభవన్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. బీజేపీ జాతీయ నాయకులు సిట్‌ నోటీసులు వెళ్లడంతో తనను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని రోహిత్‌రెడ్డి ఆరోపించారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారడాన్ని భరించలేక చేతుల్లో ఉన్న దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రయోగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ పంపిన నోటీసుల్లో ఏ కేసు గురించి ప్రస్తావించలేదని, వ్యక్తిగత సమాచారం, ఆస్తులకు సంబంధించి వివరాలు అడిగారని ఎమ్మెల్యే తెలిపారు.

మొదటి రోజు ఆరు గంటలు విచారించారని, ఏ కేసుకు సంబంధించిన విషయంలో విచారిస్తున్నారని చెప్పలేదని, ఎలక్షన్ అఫిడవిట్ గురించి మాత్రమే అడిగారని చెప్పారు. రెండో రోజు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి అడిగిన అన్ని ప్రశ్‌నలకు సమాధానం ఇచ్చినట్లు రోహిత్‌రెడ్డి వివరించారు. కేసుకు సంబంధంలేని అభిషేక్‌ను విచారించారని, పొంతన లేని వివరాలను ఈడీ అధికారులు అడిగారంటూ రోహిత్‌రెడ్డి ఆరోపించారు. తనను భయబ్రాంతులకు గురిచేసి లొంగదీసుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.

దొంగే దొంగ అన్నట్లుంది బీజేపీ వ్యవహారం

కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తననే విచారించడం విడ్డూరంగా ఉందని రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. తనతో పాటు అభిషేక్‌ను విచారిస్తే వారికి కావాల్సింది దొరకలేదని, కొత్తగా నందకుమార్‌ను విచారిస్తున్నారని విమర్శించారు. ఏదో విధంగా నందకుమార్‌ వాంగ్మూలాన్ని తీసుకొని తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

దొంగే దొంగ అన్నట్లు బీజేపీ వ్యవహారం ఉందని, బీజేపీకి అనుకూలంగా నందు వాంగ్మూలం తీసుకోవాలని ఈడీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తననే నేరస్థుడిగా చూపేలా నందకుమార్‌ నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేస్తారని, ఈ మేరకు తనవద్ద సమాచారం ఉందని వివరించారు. తనతో పాటు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి వ్యక్తిగత ఇమేజ్‌ను దెబ్బతీయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదని రోహిత్‌రెడ్డి తెలిపారు.

బీఎల్‌ సంతోష్‌, తుషార్‌ విచారణకు ఎందుకు రావడం లేదు

బీజేపీ దొడ్డిదారిలో ప్రభుత్వాలను పడగొట్టిందని రోహిత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ప్రయత్నం బెడిసికొట్టే సరికి బీజేపీ ఓర్వలేక ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. ఎన్ని కేసులతో భయపట్టినా, బీజేపీకి భయపడేది లేదన్నారు. బీఎల్‌ సంతోష్‌, తుషార్‌ సిట్‌ విచారణకు ఎందుకు రావడం లేదని నిలదీశారు. తప్పు చేయకుండా ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

మనీలాండరింగ్‌ జరగనప్పటికీ ఈడీ ప్రశ్నిస్తోందని, తన పరిధిలోకి రాని కేసును ఈడీ ఎందుకు స్వీకరించిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలని, ఇది ప్రజాసమస్య అని తెలిపారు. ప్రజాస్వామ్యం ఎటువెళ్తుందో అందరూ ఆలోచించాలని, బీజేపీ అరాచకాలను గమనించాలన్నారు. తెలంగాణ సమామంతా ఏకమైన బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.