విధాత, హైదరాబాద్ : అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, స్వయంభు పాంచ నరసింహుడు కొలువైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రానుసారం వైభవంగా నిర్వహించనున్నారు. ప్రధానాలయ పునఃనిర్మాణం పిదప రెండో వార్షిక బ్రహ్మోత్సవాలు కావడం విశేషం. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తొలిసారిగా జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలకు అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి, తన మంత్రులతో కలిసి నేడు సోమవారం యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకోనున్నారు. మాజీ సీఎం కేసీఆర్ నిర్మించిన యాదాద్రి పునర్నిర్మాణ ఆలయాన్ని సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి దర్శించుకోనుండటం ఇదే తొలిసారి. తన యాదాద్రి ప్రధానాలయ సందర్శనలో భాగంగా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారన్నది కూడా ఆసక్తి రేపుతుంది. బహుశా యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా తిరిగి మార్చవచ్చని తెలుస్తుంది. బ్రహ్మోత్సవాలలో సీఎం పట్టువస్త్రాల సమర్పణ ఆనవాయితీలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ఈ దఫా స్వామివారి కల్యాణోత్సవానికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారో లేదో చూడాల్సివుంది. బ్రహ్మోత్సవాలతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి ఆలయ సందర్శన సందర్భంగా అవసరమైన ఏర్పాట్లను కలెక్టర్ హనుమంత్ కె.జండగే. రాచకొండ సీపీ తరుణ్‌జోషి, ఆలయ ఈవో రామకృష్ణారావులు పర్యవేక్షిస్తున్నారు. యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ధార్మిక సాహిత్య సంగీత మహాసభలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించనున్నాయి.
11రోజుల పాటు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 11రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగనున్నాయి. పాల్గుణ శుద్ధ పాడ్యమి సోమవారం నుంచి ఫాల్గుణ శుద్ధ ధ్వాదశి 21వ తేదీ గురువారం వరకు కొనసాగనున్న బ్రహ్మోత్సవాల్లో స్వామివారి అలంకార, వాహన సేవలు భక్తులను అలరించనున్నాయి. సోమవారం 11గంటలకు శ్రీ విష్వక్సేన ఆరాధన, స్వస్తి వాచనం, రక్షాబంధనంతో మొదలవ్వనున్న బ్రహోత్సవ ఘట్టంలో సాయంత్రం 6.30గంటలకు మృత్యంగ్రహణం, అంకురారోపణం కార్యక్రమాలు నిర్వహిస్తారు. 12వ తేదీన ఉదయం 8గంటలకు అగ్నిప్రతిష్ట, 11గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6.30గంటలకు భేరీ పూజ, దేవతాహ్వానం, హవనం నిర్వహిస్తారు. 13వ తేదీన ఉదయం 9గంటలకు మత్స్యావతార అంలకార సేవ, వేదాపారయణాల ప్రారంభం, రాత్రి 7గంటలకు శేష వాహన అంలకార సేవ నిర్వహించనున్నారు. 14వ తేదీన ఉదయం వటపత్ర శాయి అలంకార సేవ, రాత్రి హంసవాహన సేవ, 15వ తేదీన శ్రీ కృష్ణాలంకార(మురళీకృష్ణుడు) సేవ, రాత్రి పొన్న వాహన సేవ, 16వ తేదీన గోవర్ధనగిరిధారి అలంకార సేవ, రాత్రి సింహవాహన సేవ, 17వ తేదీన ఉదయం జగన్మోహిని అలంకార సేవ, రాత్రి అశ్వవాహన సేవ, శ్రీ స్వామివారి ఎదుర్కోలు ఘట్టం నిర్వహించనున్నారు. 18వ తేదీన ఉదయం 9గంటలకు శ్రీరామ అలంకార సేవ, హనుమంత వాహనసేవ, రాత్రి 8.45గంటలకు గజవాహన సేవ, శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. 19వ తేదీన ఉదయం శ్రీ మహావిష్ణువు అంలకార సేవ, గరుడ వాహన సేవ, రాత్రి దివ్య విమాన రథోత్సవం, 20వ తేదీన ఉదయం 10.30గంటలకు మహాపూర్ణాహుతి, చక్రతీర్ధం, రాత్రి శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసనం, దోపు ఉత్సవం, 21వ తేదీన ఉదయం 10గంటలకు శ్రీ స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి స్వామివారి శృంగార డోలోత్సవంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.
నిత్య కార్యక్రమాల రద్దు
బ్రహ్మోత్సవాల కారణంగా 11 రోజులపాటు స్వామి వారి నిత్యమొక్కు కళ్యాణాలు, నిత్య బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహ హోమం, హవన పూజలను నిలిపివేయనున్నారు. 11 రోజులపాటు రాత్రివేళ అనంతరం రాత్రి 8:15 గంటల నుంచి 9 గంటల వరకు బలిహరణం, రాత్రి నివేదన జరుపుతారు. రాత్రివేళ ఎనిమిది గంటలకు అలంకార తిరువీధి సేవలు, సర్వదర్శనాలు ఆరంభించి రాత్రి పది గంటలకు శయనోత్సవ దర్శనం, ఆలయ ద్వారా బంధనం గావిస్తారు. ఈ నెల 17 నుంచి 19 వరకు నిత్యార్చనలు, భోగములు, 20, 21వ తేదీల్లో భక్తులు జరిపించుకునే అభిషేకము నిత్యార్చనలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా స్వామి సన్నిధిలో మొక్కు సేవలు 11 రోజులపాటు సాయంత్రం నాలుగు గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు.