Yadadri
విధాత: యాదాద్రి (Yadadri) శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని స్వామి వారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేద పండిత బృందం శాస్త్ర యుక్తంగా లక్ష పుష్పార్చన నిర్వహించి మంగళ హారతినిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు.
రేపటినుండి శ్రీనృసింహ జయంతి ఉత్సవాలు
శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రేపటి నుంచి 4వ తేదీ వరకు శ్రీనృసింహ జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లుగా ఈవో గీతారెడ్డి తెలిపారు. జయంతి ఉత్సవాల్లో భాగంగా రేపు మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు స్వస్తివచనం, విశ్వక్షేన్ ఆరాధన, పుణ్యాహవాచనంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. లక్ష కుంకుమార్చన, తిరు వెంకటపతి అలంకార సేవ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు మత్సాంగ్రహనం, అంకురార్పణ హవనం, గరుడ వాహనంపై పర వాసుదేవ అలంకరణ సేవతో గరుడోత్సవం నిర్వహిస్తారు.
మూడవ తేదీ బుధవారం ఉదయం నిత్యమూల మంత్ర హవనం, లక్ష పుష్పార్చన, ఖాళీయ మర్దనుడి అలంకార సేవ, సాయంత్రం నృసింహ మూలమంత్ర హవనం, హనుమంత వాహనంపై శ్రీ రామ అవతార అలంకార సేవ నిర్వహిస్తారు. మాడ వీధుల్లో ఊరేగిస్తారు.
నాలుగవ తేదీ గురువారం ఉదయం 7 గంటలకు నరసింహ మూలమంత్ర హోమం, 9 గంటల నుండి 9:30 గంటల వరకు మహా పూర్ణాహుతి,అనంతరం సహస్ర కలశాభిషేకం, సాయంత్రం ఏడు గంటల నుండి నరసింహ జయంతి, నృసింహ ఆవిర్భావం, మహా నివేదన, తీర్థప్రసాద గోష్టి తో ఉత్సవాలను ముగిస్తారు.
అనుబంధ ఆలయమైన శ్రీ పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో సైతం రెండవ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. స్వామి వారి జయంతి ఉత్సవాల సందర్భంగా యాదాద్రి ప్రధానాలయంతో పాటు పాత గుట్ట ఆలయంలో రెండవ తేదీ నుంచి 4వ తేదీ వరకు శ్రీ సుదర్శన నరసింహ హోమం, నిత్య, శాశ్వత కళ్యాణం, నిత్య శాశ్వత బ్రహ్మోత్సవాలను రద్దు చేసినట్లు ఈవో గీత తెలిపారు. ఈ తేదీలలో భక్తులు సహకరించాలని కోరారు.