వైసీపీకి షాక్‌.. ఇద్ద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేలు గుడ్‌బై

అసెంబ్లీ ఎన్నికల తరుణంలో వైసీపీకి షాక్ తగిలింది. ఇద్ద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ వీడారు

  • Publish Date - March 24, 2024 / 01:17 PM IST

విధాత : అసెంబ్లీ ఎన్నికల తరుణంలో వైసీపీకి షాక్ తగిలింది. ఇద్ద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ వీడారు. తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వైసీపీని వీడి క‌మ‌లం గూటికి చేర‌గా, ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా వైఎస్ ష‌ర్మిల స‌మ‌క్షంలో ఆదివారం కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. వీరిద్ద‌రికీ వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ టికెట్ నిరాకరించ‌డంతో తీవ్ర అసంతృప్తి చెందిన ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పారు.

గూడూరు ఎమ్మెల్యే వ‌ర‌ప్రసాద్‌కు టికెట్ ఇవ్వ‌కుండా ఆయ‌న స్థానంలో మేరిగ మురళీధరకు వైసీపీ అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతప్తికి గురైన వరప్రసాద్ ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ దావడే సమక్షంలో బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. 2019లో గూడూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి వరప్రసాద్ పోటీ చేసే అవకాశముంది. బీజేపీలో చేరిన సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ప్రధాని నరేంద్రమోదీకే సాధ్యమన్నారు. ఆయన సారథ్యంలో పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పారు. మరోసారి తిరుపతి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారంటూ కృతజ్ఞతలు తెలిపారు. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా స్థానంలో త‌న‌ను కాద‌ని కంభం విజయరాజును సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. దీంతో హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

Latest News