కోట్ల సంవ‌త్స‌రాల క్రితం మ‌గ దోమ‌లూ ర‌క్తం పీల్చేవి.. త‌ర్వాత ఏమైందంటే..!

మ‌నిషిని ఇబ్బంది పెట్టే జీవుల్లో అతి చిన్న‌గా ఉండే దోమలు కూడా ఒక‌టి. వాటి ముల్లు లాంటి తొండాన్ని చ‌ర్మం లోకి దింపి ర‌క్తం పీలుస్తుంటే సూదుల‌తో గుచ్చుతున్న బాధ క‌లుగుతుంది

  • Publish Date - December 5, 2023 / 08:59 AM IST

విధాత‌: మ‌నిషిని ఇబ్బంది పెట్టే జీవుల్లో అతి చిన్న‌గా ఉండే దోమలు (Mosquito) కూడా ఒక‌టి. వాటి ముల్లు లాంటి తొండాన్ని చ‌ర్మం లోకి దింపి ర‌క్తం పీలుస్తుంటే సూదుల‌తో గుచ్చుతున్న బాధ క‌లుగుతుంది. అవి వైర‌స్‌కు వాహ‌కాలుగానూ ప‌నిచేసి మ‌న‌ల‌ను వ్యాధుల బారిన ప‌డేట‌ట్టూ చేస్తాయి.


అయితే సాధార‌ణంగా ఆడ దోమ‌లు మాత్ర‌మే ఇలా ర‌క్తం పీల్చే ప‌నిని చేస్తాయ‌ని శాస్త్రవేత్త‌లు ఇప్ప‌టికే నిర్ధారించారు. అయితే ఒక‌ప్పుడు మ‌గ దోమ‌లు కూడా ర‌క్తం పీల్చేవ‌ని.. త‌ర్వాత జరిగిన ప‌రిణామ క్ర‌మంలో అవి ఈ ప‌నిని మానుకున్నాయ‌ని శాస్త్రవేత్త‌లు క‌నుగొన్నారు.


ప‌రిశోధ‌న‌లో భాగంగా లెబ‌నాన్‌లో దొరికిన ఒక అవ‌శేషంలోని దోమ శిథిలాల‌ను ప‌రిశీలించారు. ఆ వివ‌రాల‌ను న్యూయార్క్ టైమ్స్ (Study) ప్ర‌చురించింది. ఈ దోమ అవ‌శేషాలు దొరికిన లెబ‌నీస్ ఆంబ‌ర్.. త‌న‌లో ఎన్నో శిథిలాల‌ను, శిలాజాల‌ను దాచి ఉంచుకుంది. వీటి వ‌య‌సు గ‌రిష్ఠంగా 12.5 కోట్ల సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఉండొచ్చు.


అధ్య‌య‌నంలో భాగంగా శాస్త్రవేత్త‌లు ఈ శిలాజాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూశారు. తొలుత దానిని చూసి అది ఒక దోమ‌ని అనుకోలేద‌ని.. కానీ మైక్రోస్కోప్‌లో చూస్తే అది ఒక మ‌గ దోమది అని తెలిసి ఆశ్చ‌ర్య‌పోయామ‌ని నాంజింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పాలియాంటాల‌జిస్ట్ గా ఉన్న డేనీ అజ‌ర్ వివ‌రించారు. దానికి కార‌ణం.. దాని ఉద‌ర భాగంలో ఒక క‌త్తెర లాంటి నిర్మాణం ఉండ‌ట‌మే కార‌ణ‌మ‌ని తెలిపారు.


ఇలాంటి నిర్మాణం ప్ర‌స్తుత మ‌గ దోమ‌ల్లో లేద‌ని.. ఇప్ప‌టి ఆడ దోమ‌ల‌కు ర‌క్తం పీల్చ‌డానికి ఏదైతే నిర్మాణం ఉందో.. ఇదీ అలానే ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. కాబ‌ట్టి గ‌తంలో కోట్ల సంవ‌త్స‌రాల క్రితం మ‌గ దోమ‌లు కూడా ఇత‌ర జీవుల ర‌క్తాన్ని పీల్చుకునేవ‌ని భావిస్తున్న‌ట్లు అధ్య‌య‌నంలో వెల్ల‌డించారు.


ఎందుకు ఆపేసిన‌ట్లు..?


తొలుత ర‌క్తం పీల్చుకునే మ‌గ దోమ‌లు.. త‌ర్వాతి కాలంలో ఎందుకు ఆ ప‌నిని ఎందుకు మానేశాయ‌ని శాస్త్రవేత్త‌లు విశ్లేషించారు. సాధార‌ణంగా ర‌క్తం పీల్చ‌డం అనేది దోమ‌కు చాలా క‌ష్ట‌మైన ప‌ని. గ‌ర్భం దాల్చ‌డానికి అద‌న‌పు శ‌క్తి అవ‌స‌ర‌మైన‌పుడే ఈ ప‌నికి అవి పూనుకుంటాయి. సాధార‌ణ జీవ‌నానికి పూల తేనెపైనే ఆధార‌ప‌డ‌తాయి. ఈ నేప‌థ్యంలో మ‌గ దోమ‌కు గ‌ర్భం దాల్చి, గుడ్లు పెట్టాల్సిన అవ‌స‌రం లేదు. కాబ‌ట్టి త‌ర్వాతి త‌ర్వాతి కాలంలో ఉద‌ర భాగంలో ఉన్న ఆ అవ‌యవాన్ని అవి ఉప‌యోగించ‌డం మానేశాయి.


దీంతో క్ర‌మంగా ఆ భాగం అంత‌రించి.. ఇప్ప‌టి మ‌గ దోమ‌ల రూపానికి చేరుకున్నాయ‌ని శాస్త్రవేత్త‌లు వెల్ల‌డించారు. అయితే ఇప్పుడు లెబ‌నాన్‌లో దొరికిన శిలాజం దోమ‌ది కాక‌పోయే అవ‌కాశాలూ ఉన్నాయ‌ని.. దోమ‌దే అయినా ఆ అద‌న‌పు భాగం.. ర‌క్తం పీల్చ‌డానికి ఉప‌యోగించేది కాక‌పోవ‌చ్చ‌ని డేనీ అజ‌ర్ పేర్కొన్నారు. మ‌రింత లోతుగా ప‌రిశోధ‌న‌లు చేసి.. నిర్దిష్ట‌మైన ఫ‌లితాల‌ను ఇస్తామ‌ని చెప్పుకొచ్చారు.

Latest News