Periods Pain Relief | ప్రతి అమ్మాయి యుక్త వయసు( Adolescence ) రాగానే రజస్వల అవుతుంది. అదేనండి అమ్మాయిల్లో మొదటిసారిగా బహిష్టు( Periods ) లేదా రుతుస్రావం( menstrual cycle ) ప్రారంభం అవడం. వాడుక భాషలో పుష్పవతి అవ్వడం అని కూడా అంటారు. ఈ ప్రక్రియ సాధారణంగా 12 ఏండ్ల నుంచి 14 ఏండ్ల వయసు మధ్యలో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఏండ్ల పాటు ప్రతి మాసం నెలసరి ప్రక్రియ కొనసాగుతుంది.
అయితే నెలసరి సమయంలో యువతులు, మహిళలు తీవ్రమైన బాధలు అనుభవిస్తారు. శరీరం నీరసానికి గురవ్వడం, కడుపు నొప్పి( Stomach Pain ), నడుము నొప్పితో బాధపడుతుంటారు. అలసట కారణంగా లో బీపీ( Low BP ) వంటి సమస్యలను ఎదుర్కొంటారు. తీవ్ర మానసిక ఒత్తిడికి కూడా లోనవుతారు. ఇలాంటి యువతులు, మహిళలు.. నెలసరి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
నెలసరి నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి..?
వేడి కాపడం..
నెలసరి సమయంలో తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడేవారు.. పొత్తి కడుపు మీద వేడి కాపడం పెడితే గర్భాశయం కండరాలు ఉపశమనం పొంది నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి వేడి నీళ్లు నింపిన బాటిల్‌ను పొత్తి కడుపు మీద ఉంచి కాపాలి. వేడి వేడిగా జావ తాగినా.. వేడి నీటితో స్నానం చేసినా కూడా నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు.
శొంఠి, మిరియాల టీ
ఆయుర్వేదంలో శొంఠి, మిరియాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అనేక రకాల మందుల్లో ఈ రెండింటిని ఉపయోగిస్తారు. ప్రతి ఇంట్లో కూడా ఈ రెండు పదార్థాలు ఉంటాయి. అయితే శొంఠి, మిరియాల పొడి కలిపిన నీళ్లను బాగా వేడి చేయాలి. దాంతో హెర్బల్ కషాయం తయారవుతుంది. ఈ కషాయం తాగితే నొప్పులకు కారణమయ్యే హర్మోన్ల పరిమాణం తగ్గి నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. ఈ కషాయం వల్ల నెలసరి సమస్యలు కూడా తగ్గిపోయి, అలసట దూరమయ్యే అవకాశం ఉంటుంది.
నువ్వుల నూనెతో మర్దన
నెలసరి నొప్పులకు నువ్వుల నూనె కూడా సమర్థవంతంగా పని చేస్తుంది. నువ్వుల నూనెలోని లినోలిక్ యాసిడ్‌కు శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే గుణం కలిగి ఉంటుంది. కాబట్టి నెలసరి సమయంలో ఈ నూనెతో పొత్తి కడుపు మీద సున్నితంగా మర్దన చేస్తే కడుపు నొప్పి నుంచి రిలాక్స్ కావొచ్చు.
వ్యాయామంతో ఉపశమనం
ఇక నెలసరి నొప్పులు ఉన్నాయని బెడ్‌కే పరిమితం కావడం మంచిది కాదు. ఓ అరగంట పాటు వ్యాయామం చేయాలి. దీంతో రక్తప్రసరణ పెరిగి నొప్పులు తగ్గిపోతాయి. తేలికపాటి వ్యాయామం వల్ల కండరాలు వదులుగా మారి నొప్పులు తగ్గే అవకాశం ఉంది. ఆ మూడు రోజులే కాకుండా ప్రతి రోజు వ్యాయామం చేయడం వల్ల ప్రతి మాసం నెలసరి నొప్పులు అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
