Smart Phone | అమెరికా( America )లోని సెపియన్స్ ల్యాబ్ నిర్వహించిన ఒక అధ్యయనంలో 1 లక్ష మందికి పైగా యువకుల డేటా ను విశ్లేషించారు. ఇందులో 13 ఏళ్లకు ముందే స్మార్ట్ ఫోన్( Smart Phone ) లు కలిగి ఉన్న పిల్లలు, ఆ తర్వాత డిప్రెషన్, ఆత్మన్యూనత, ఆత్మహత్యా ఆలోచనలు రావడం వంటి సమస్యలకు గురయ్యారని తేలింది.
చిన్న వయస్సులో ఫోన్ – తీవ్రమైన ప్రభావాలు:
- 5 లేదా 6 సంవత్సరాల వయస్సులో ఫోన్ ఉన్న ఆడపిల్లల్లో 47 శాతం మంది తీవ్రమైన ఆత్మహత్యా ఆలోచనలతో ఉన్నట్టు చెప్పారు.
- ఇక 13 ఏళ్ల తర్వాత ఫోన్ పొందినవారిలో ఇది 28 శాతం మాత్రమే. అంటే వయస్సుతో పాటు మానసిక స్థైర్యం మెరుగవుతున్నదని స్పష్టమవుతోంది.
- స్మార్ట్ ఫోన్ వాడకాన్ని ప్రారంభించిన వయస్సు, సోషల్ మీడియా యాక్సెస్ మొదలుపెట్టిన సమయం ఆధారంగా పిల్లల మానసిక స్థితిలో తేడా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.
పిల్లల మానసిక అభివృద్ధిని కాపాడాలంటే:
- కనీసం 14 ఏళ్ల వయస్సు వరకు స్మార్ట్ ఫోన్ ఇవ్వకూడదు.
- సోషల్ మీడియా వాడకాన్ని 16 ఏళ్ల వయస్సు వరకు వాయిదా వేయాలి.
అలానే, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాలకులు – అందరూ కలిసి పిల్లలకు ఒక డిజిటల్ హైజీన్ సంస్కృతి నేర్పాల్సిన అవసరం ఉంది. పిల్లల ప్రవర్తనలో మార్పులు, ఒత్తిడి, ఒంటరితనం వంటి లక్షణాలను గమనించి ముందస్తుగా జాగ్రత్తపడాలి.
వినోదం కాదు… సమస్య
మా చిన్నోడు అప్పుడే ఫోన్ గురించి ఇవి తెలుసుకున్నాడా… మా చిన్నది ఫోన్ లేకుండా తిండి కూడా తినదు… అంటూ సాంకేతిక సౌకర్యాలను ఎప్పుడెప్పుడు పిల్లలకు అందిస్తామా అనే ఉత్సాహం చూపించడం కన్నా వాళ్లకు ఎప్పుడు, ఏ వయసులో, ఎందుకోసం ఇవ్వాలనే విషయంలో తల్లిదండ్రులకు చిత్తశుద్ధి అవసరం. పిల్లల మెదడు ఇంకా అభివృద్ధిలో ఉన్న సమయంలో ఎక్కువ స్క్రీన్ టైమ్, సామాజిక ఒత్తిళ్లు వాళ్లను మానసికంగా కుంగదీస్తాయి. స్మార్ట్ ఫోన్ అనేది కేవలం తాత్కాలిక వినోదం కాదు. దీర్ఘకాలిక ప్రభావాలు ఉన్న మానసిక ఆరోగ్య సమస్యగా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని ఈ పరిశోధనల ద్వారా చెప్పక తప్పదు.
