విధాత: ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) పాలనకు వ్యతిరేకంగా చెలరేగిన నిరసనలు మరింత తీవ్రమయ్యాయి. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నారు. అయితే, అక్కడి అధికారులు నిరసనకారులను ఎక్కడికక్కడ అణచివేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆందోళనల్లో వేలాది మంది మరణించినట్లు తెలుస్తోంది.
ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకూ 2,570 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి అధికారులను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. మృతుల్లో పౌరులతో పాటు ప్రభుత్వ భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు, విధ్వంసకారుల చేతుల్లో ఈ మరణాలు సంభవించాయని పేర్కొన్నారు. అయితే, మానవ హక్కలు సంఘాలు మాత్రం భద్రతా దళాలు జరిపిన కాల్పుల వల్లే పౌరులు మరణించినట్లు పేర్కొంటోంది. మరోవైపు రాజధాని టెహ్రాన్ సహా ప్రధాన నగరాల్లోని ఆసుపత్రులన్నీ శవాల దిబ్బలుగా మారాయని స్థానిక మీడియా వెల్లడిస్తోంది.
12 వేల మంది మృతి..?
ప్రభుత్వం ప్రకటించిన ఈ సంఖ్యను విపక్షాల అనుకూల వెబ్‌సైట్ ఇరాన్ ఇంటర్నేషనల్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ భద్రతా దళాల చేతుల్లో 12 వేల మందికి పైగానే ఇరాన్ పౌరులు మరణించారని వెల్లడించింది. ఇది ఇరాన్ ఆధునిక చరిత్రలో అతి పెద్ద మారణ హోమంగా అభివర్ణించింది. ఇరాన్ ప్రభుత్వం సొంత భద్రతా సంస్థలు, ఇతర సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు ఈ మృతుల సంఖ్యను పేర్కొన్నట్టు ఈ వెబ్‌సైట్ వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ ఇంటర్నెట్ నిలిపివేశారు. దీంతో మరణాలపై పూర్తి వివరాలు తెలియడం లేదు.
అసలు ఇరాన్ ఆందోళనలకు కారణం ఏంటి..?
ఇరాన్ నిరసనలకు ప్రధాన కారణం తీవ్ర ఆర్థిక సంక్షోభం, రాజకీయ అసంతృప్తి. ధరల పెరుగుదల, కరెన్సీ పతనం, నిరుద్యోగం సామాన్యులను వీధుల్లోకి తెచ్చాయి. కఠిన చట్టాలు, పౌర హక్కుల అణచివేత, దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇరాన్‌లో 1989 నుంచి ఖమేనీ పాలన కొనసాగుతున్నది. ఆయన పాలనలో మహిళలపై తీవ్రమైన ఆంక్షలను అమలు చేశారు. సంప్రదాయాలను పాటించని మహిళలను నిర్బంధించి, హింసించారు. దీంతో ఖమేనీ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. 2022 ఏడాది ‘మహసా అమినీ’ మరణం తర్వాత మొదలైన స్వేచ్ఛా పోరాట స్ఫూర్తితో తమకు మెరుగైన జీవన ప్రమాణాలు, ప్రజాస్వామ్యం కావాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇరాన్‌లో రాజకీయ, ఆర్థిక మార్పుకై రోడ్డెక్కారు.
31 ప్రావిన్సుల్లో నిరసనలు..
దేశవ్యాప్తంగా దాదాపు 31 ప్రావిన్సుల్లో 600కిపైగా ప్రదేశాల్లో నిరసనలు కొనసాగుతున్నట్లు అమెరికా కేంద్రంగా నడిచే మానవ హక్కుల కార్యకర్తల వార్తా సంస్థ పేర్కొంది. ప్రస్తుతం అక్కడ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. కేవలం ప్రభుత్వ వెబ్‌సైట్లే పని చేస్తున్నాయి. టెహ్రాన్‌లో భారీగా భద్రత ఉంది. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారుల దాడుల్లో గాయపడకుండా తలకు హెల్మెట్లు పెట్టుకుని, రక్షణ షీల్డ్‌లను ధరించి ఆయుధాలతో రోడ్లపైకి వెళ్తున్నారు.
సిగరెట్లు తాగుతూ మహిళల నిరసన
ఇరాన్ ప్రభుత్వంపై ఉద్యమిస్తున్న నిరసనకారులు వినూత్న రీతుల్లో తమ నిరసనను తెలియజేస్తున్నారు. మహిళలు సిగరెట్లు తాగుతూ, ఇరాన్ అధినేత అయతొల్లా ఖమేనీ ఫొటోలను కాల్చేస్తున్నారు. ఈ ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. మరోవైపు ఆందోళనకారులపై ఇరాన్ పాలకులు ఉక్కుపాదం మోపుతున్నారు. మరణశిక్ష అమలు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. దీంతో అమెరికా రంగంలోకి దిగింది. నిరసనకారులకు ఉరిశిక్ష విధిస్తే సైనిక చర్య తప్పదనే సంకేతాలను ఇచ్చింది.
నిరసనలు కొనసాగించండి.. సాయం చేస్తాం..
ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగించాలని ఆ దేశ పౌరులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పిలుపునిచ్చారు. నిరసనకారులకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ‘ఇరాన్ దేశభక్తులారా, మీ నిరసనలు కొనసాగించండి. ప్రభుత్వ సంస్థలను ఆధీనంలోకి తీసుకోండి. హంతకులు, దుర్వినియోగదారుల పేర్లను నమోదు చేసుకోండి. వారు భారీ మూల్యం చెల్లించుకుంటారు. నిరసనకారులకు సాయం అందిస్తాం’ అని పిలుపునిచ్చారు. అదే సమయంలో నిరసనలు ఆగే వరకూ ఇరాన్ అధికారులతో అన్ని సమావేశాలను రద్దు చేసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ఆందోళనలకు ఆ ఇద్దరే కారణం..
ఇరాన్‌లో ఆందోళనలకు ఇద్దరే ప్రధాన కారణమని ఖమేనీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహునే ఈ నిరసనలకు కారణమని ఆరోపించింది. తమ దేశంలో ఆందోళనలు కొనసాగేలా రెచ్చగొడుతున్నారని మండిపడింది. ఇరాన్ విషయంలో ట్రంప్ వైఖరిపై ఖమేనీ తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. ఈ మేరకు ట్రంప్‌నకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముందు మీ దేశంలోని సమస్యలను పరిష్కరించుకోండి అంటూ చురకలంటించారు. అయినా ట్రంప్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్‌తో వాణిజ్యం చేసే అన్ని దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
ఈ నేపథ్యంలో అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) తీవ్ర హెచ్చరికలు చేశారు. అమెరికా తన మోసపూరిత చర్యలను, నమ్మక ద్రోహులైన కిరాయి వ్యక్తులపై ఆధారపడటాన్ని తక్షణమే నిలిపి వేయాలని హెచ్చరించారు. ఇరాన్ బలమైన, శక్తిమంతమైన దేశం అని పునరుద్ఘాటించారు. ఇరాన్ ప్రజలు చాలా చైతన్యవంతులు.. వారికి శత్రువు ఎవరో తెలుసునని వ్యాఖ్యానించారు. శత్రువులను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని ఖమేనీ హెచ్చరించారు.
