మొటిమలు ఎక్కువ.. ముఖంపై వెంట్రుకలు.. మగవాళ్ళలా గడ్డం..

ప్రతి నెలా నెలసరి బాధ ఉన్నప్పుడే ఆడవాళ్ళ బాధ చెప్పనలవి కాదు. అలాంటిది.. గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ వంటి సమస్యలున్నప్పుడు అమ్మాయిల బాధ ఒకరికి చెప్పుకోలేనిది

  • Publish Date - June 19, 2024 / 12:18 PM IST

అండాశయ తిత్తులతో జాగ్రత్త !

ప్రతి నెలా నెలసరి బాధ ఉన్నప్పుడే ఆడవాళ్ళ బాధ చెప్పనలవి కాదు. అలాంటిది.. గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ వంటి సమస్యలున్నప్పుడు అమ్మాయిల బాధ ఒకరికి చెప్పుకోలేనిది.. అనుభవించరానిది… పీసీఓడీ సమస్య ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి కారణాలు, పరిష్కారం ఏంటో ఇప్పుడు చూద్దాం.

పీసీఓడీ.. పాలీసిస్టిక్ ఒవేరియన్ డీసీజ్

అండాశయాల్లో సిస్ట్ లు ఏర్పడటాన్నే పాలీ సిస్టిక్ ఓవరీ వ్యాధి అంటారు. స్త్రీల హార్మోన్లలో సమతుల్యం దెబ్బతినడం వల్లనే పీసీఓడీ వస్తుంది. అండాశయంలో ఫోలికిల్స్, కార్టెక్స్ అని రెండు భాగాలుంటాయి. పీసీఓడీ ఉన్నప్పుడు కార్టెక్స్ చాలా పెరిగిపోతుంది. అంతేగాకుండా నెలసరి వచ్చిన కొత్తలో ప్రతి నెల తప్పనిసరిగా అండం విడుదల ఉండదు. అందువల్ల మెదడు స్త్రీ హార్మోన్లకు బదులుగా పురుష హార్మోన్లయిన టెస్టోస్టిరాన్స్ ను ప్రేరేపిస్తుంది. ఈ కారణాల వల్ల టెస్టోస్టిరాన్స్, అడ్రినల్ కి సంబంధించిన హార్మోన్లు చాలా ఎక్కువ అవుతాయి.

అందువల్ల మొటిమలు బాగా రావడం, ముఖం, పొట్ట, ఛాతీ, వెన్ను లాంటి ఇతర శరీర భాగాలలో రోమాలు ఎక్కువ పెరిగిపోవడం, గడ్డం రావడం, జుట్టు రాలిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు.. నెలసరిలో సమస్యలతో బాధ పడుతారు. పీరియడ్స్ సరిగా రాకపోవడం, వచ్చినప్పుడు రక్త స్రావం అధికంగా ఉండటం, విపరీతమైన కడుపు నొప్పి. బరువు పెరగడం వంటి సమస్యలతో సతమతం అవుతుంటారు.

జన్యువులే కారణమా..?

మధుమేహ వ్యాధి ఎక్కువగా పెరిగిపోతుండడంతో, పీసీఓడీ సమస్య కూడా ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. డయాబెటిస్ కి సంబంధించిన జన్యువులు ఉన్నవాళ్లలో పీసీఓడీ సమస్య వచ్చేందుకు ఆస్కారం ఉంటున్నట్టుగా అనేక అధ్యయనాల్లో తేలింది. తల్లిదండ్రుల్లో షుగర్ ఉంటే పిల్లలకు పీసీఓడీ వచ్చే అవకాశాలెక్కువ. తల్లిదండ్రుల్లో ఒకరిలో షుగర్ ఉంటే పిల్లలకు పీసీఓడీ వచ్చే అవకాశం 50 శాతం వరకు ఉంటుంది.

అసలు నేరం ఆధునిక జీవన శైలిదే

పీసీఓడీ పెరగడానికి మరో ప్రధాన కారణం మారుతున్న జీవన శైలి. ముఖ్యంగా టీనేజిలో ఉన్న పిల్లలు సమోసాలు, పిజ్జాలు, బర్గర్ల వంటి బేకరీ ఫుడ్ కి బాగా అలవాటు పడిపోయారు. శారీరక శ్రమ తగ్గిపోయింది. చదువు, ఉద్యోగాలు తప్ప వ్యాయామం చేసే తీరిక లేదు. దాంతో బరువు పెరిగిపోతున్నారు. టీనేజీలోనే పిల్లల్ని స్థూలకాయ సమస్య వేధిస్తోంది. బరువు పెరగడం వల్ల హార్మోన్లలో మార్పులు కలుగుతాయి.

రాకుండా ఉండాలంటే..

పీసీఓడీ ఉన్నవాళ్లలో ఫర్టిలిటీ సమస్యలు కూడా వస్తాయి. పీసీఓడీ ఉన్న మహిళ గర్భవతి అయితే పుట్టబోయే ఆడబిడ్డకి ఈ సమస్య రాకుండా నివారించే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇకపోతే పీసీఓడీ వచ్చిన తర్వాత మందులు వాడే కన్నా అది రాకుండా చూసుకోవడమే బెటర్. ఈ పాలీ సిస్టిక్ ఓవరీ డిసీజ్ బారిన పడకుండా ఉండాలంటే పిల్లలు బరువు పెరగకుండా, స్థూలకాయం రాకుండా ఉండేలా జాగ్రత్తపడాలి. పిల్లలకు ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు చేయకూడదు. బరువు పెరగొద్దన్నా, డయాబెటిస్ రావొద్దన్నా పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది.

Latest News