ఆరోగ్యకరమైన జీవితానికి శారీరక, మానసిక శ్రేయస్సును పెంపొందించడంలో నిద్ర (Sleeping) కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి తగినంత నిద్ర లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతాయి. మధుమేహం, గుండె సమస్యలు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ప్రమాదం ఎక్కువ. రోజుకు 7-9 గంటల నాణ్యమైన నిద్ర మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యంగా, అందంగా ఉండాలనుకుంటే నిద్ర చాలా ముఖ్యం.
అయితే, నిద్ర విషయంలో చాలా మంది అజాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఫోన్లు, డిజిటల్ పరికరాల వాడకంతో నిద్ర సమయం చాలా వరకు తారుమారై పోయిందనే చెప్పాలి. దీంతో అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. సరిగ్గా నిద్రపోకుంటే రోజంతా చిరాకుగా అనిపిస్తుంది. తలనొప్పి వస్తుంది. ఏ పనినీ సంపూర్ణంగా పూర్తి చేయలేరు. నిద్ర ఎక్కువగా పోయినా, తక్కువ సమయం నిద్రపోయినా ఇబ్బందులే అంటున్నారు నిపుణులు.. అయితే మనిషికి నిద్ర ఎంత అవసరం? ఎన్ని గంటలు నిద్రపోవాలి? మంచి నిద్ర వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక బరువు..
మంచి నిద్ర వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. సాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి త్వరగా కోలుకునేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. సాధారణంగా అర్ధరాత్రి వరకూ మెలుకువగా ఉండే వారు సులువుగా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ
అని నిపుణులు చెబుతున్నారు. నిర్ణీత సమయానికి నిద్రపోయినట్లైతే బరువు నియంత్రణలో ఉంటుందట. తగినంత నిద్ర పోనివారు ఎప్పుడూ ఆందోళనతో, కంగారు పడుతూ ఉంటారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
తక్కువ నిద్రతో ఆయుఃక్షీణం..!
రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి తగినంత విశ్రాంతి చాలా అవసరం. మనిషి రోజుకు ఏడు నుంచి తొమ్మిది గంటల పాటూ నిద్రపోవాలి. ఏడు గంటల కన్నా తక్కువ నిద్రిస్తే ఆయుర్దాయం క్షీణిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనీసం ఏడు గంటలు నిద్రపోతే ఆయుష్షు పెరుగుతుందని, మధుమేహం, గుండె సమస్యలు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందట. రోజూ తినే ఆహారం, శారీరక శ్రమ, సామాజికంగా ఒంటరితనం.. అనే వాటి కన్నా ‘నిద్ర’ బలమైనదిగా తాజా అధ్యయనంలో తేలింది. సరిపడా నిద్ర లేకపోతే మెదడు, రోగ నిరోధక వ్యవస్థ, జ్ఞాపకశక్తి, శారీరక ఆరోగ్యం సహా అనేక ప్రయోజనాలను దెబ్బతీస్తున్నదని అధ్యయనం పేర్కొన్నది.
అంతేకాదు, నిద్రలేమితో శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. నిద్రలేమి అనేక విధాలుగా మనిషికి హాని చేస్తుంది. సరిగ్గా నిద్ర పోకుండా ఉంటే చర్మంపై వయసు మళ్లిన ఛాయలు కనిపిస్తాయి. కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడతాయి. రక్త ప్రసరణ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. అందుకే ప్రజలు 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Donald Trump : వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే అంటూ ట్రంప్ సంచలన ప్రకటన
Ajit Doval : మొబైల్, ఇంటర్నెట్ వాడని అజిత్ దోవల్.. ఎందుకో తెలుసా..?
