- ప్రైవేటు క్యాబ్ సంస్థలు 30 శాతం కమీషన్
- క్యాబ్ సంస్థలపై వేల కొద్దీ ఫిర్యాదులు
- ‘భారత్ టాక్సీ’లో కమీషన్లు లేవు
- కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా
Bharat Taxi App | భారతదేశంలో భారత్ టాక్సీ యాప్‌ను వచ్చే మూడు సంవత్సరాల్లో పూర్తిగా విస్తరిస్తామని, ఈ లోపు అనేక మార్పులు తీసుకువస్తామని, కొంత సహనం పాటించాలని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా కోరారు. భారత్ టాక్సీ డ్రైవర్లతో సోమవారం (23.02.2026) ఆయన న్యూఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దేశంలో తొలిసారిగా సహకార స్ఫూర్తితో ‘భారత్ టాక్సీ’ని ఫిబ్రవరి 5న న్యూఢిల్లీలో అమిత్ షా ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రైవేటు సంస్థలైన ఓలా, ఊబర్, రాపిడోలకు పోటీగా భారత్ టాక్సీ యాప్ తీసుకువచ్చామని అమిత్ షా వెల్లడించారు. డ్రైవర్లలో కొందరు గట్టిగా కష్టపడేవారు, కొందరు పార్ట్ టైమ్ పనిచేసే వారు ఉన్నారని, వీరందరూ కష్టానికి తగ్గ ఫలితం పొందేలా చేసేందుకు ఈ యాప్ ను తీసుకువచ్చామన్నారు.
ప్రస్తుతం ప్రైవేటు యాప్‌లపై వేలకొద్దీ ఫిర్యాదులు వస్తున్నాయని అమిత్‌షా అన్నారు. ప్రతి డ్రైవర్ నుంచి 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారన్నారు. ఈ యాప్ కంపెనీలు డ్రైవర్లను ఆర్థికంగా దోచుకోవడమే కాకుండా ఆర్థికంగా బలపడుతున్నాయన్నారు. సహకార సమాఖ్య విధానంతో ప్రారంభించిన భారత్ ట్యాక్సీ యాప్‌తో డ్రైవర్లు రిచ్ గా మారతారని, సంస్థ రిచ్ కాదని ఆయన వివరించారు. ఈ ప్లాట్‌ఫామ్‌లో సభ్యత్వం కోసం ప్రతి డ్రైవర్ రూ.500 చెల్లిస్తే సరిపోతుందని అన్నారు. రానున్న మూడేళ్లలో సంస్థ రూ.25 కోట్లు ఆదాయం ఆర్జిస్తే ఇందులో నుంచి 20 శాతం మొత్తం అనగా రూ.5 కోట్లు సంస్థ పేరు మీద బ్యాంకులో క్యాపిటల్ అక్కౌంట్ కింద డిపాజిట్ చేస్తారన్నారు. మిగిలిన రూ.20 కోట్లను ఏ డ్రైవర్ ఎన్ని కిలోమీటర్లు నడిపించారు అనేది లెక్కించి, ఆ ప్రకారంగా వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని తెలిపారు. ఎలాంటి కమీషన్ లేకుండా డ్రైవర్లకు డబ్బులు అందుతాయని, అయితే మూడేళ్లు ప్రతి డ్రైవర్ కొంత సహనం పాటిస్తే మొత్తం వ్యవస్థ పటిష్టమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రైవేటు యాప్ ల మాదిరి ఆదాయ అర్జన లక్ష్యంగా భారత్ టాక్సీ యాప్ పనిచేయదని, డ్రైవర్లను ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే చేస్తామన్నారు. తమ ప్రభుత్వ లక్ష్యంత వాహనాలను నడిపే డ్రైవర్లకు వేధింపులు లేకుండా వచ్చిన లాభాలను వారికే పంచడమేనని, వారి కుటుంబాలు సంతోషంగా ఉండేలా చేయడం తమ ముందున్న బాధ్యత అని అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్న అముల్, ఇఫ్కో, నాబార్డు సంస్థల ను స్ఫూర్తిగా తీసుకుని భారత్ టాక్సీ యాప్ ను రూపొందించామన్నారు. కేవలం ఒకసారి సభ్యత్వ రుసుం తీసుకుంటారని, జీరో కమీషన్ ఉంటుందని, ఛార్జీలు పారదర్శకంగా ఉంటాయని, ఆలస్య రుసుం వసూలు చేయరని ఆయన భరోసా ఇచ్చారు. ప్రైవేటు కంపెనీలు తమ సంస్థలను ఆర్థికంగా తీర్చిదిద్దుకుంటుండగా, భారత్ టాక్సీ యాప్ మాత్రం డ్రైవర్లకు కమీషన్ లేకుండా లాభాలను పంచుతుందన్నారు. వచ్చే మూడు సంవత్సరాల్లో దేశం మొత్తం భారత్ టాక్సీ అందుబాటులోకి వస్తుందని అమిత్ షా తెలిపారు.
