Bharat Taxi | జనవరి 1 నుంచి ఢిల్లీలో భారత్ ట్యాక్సీ : ఇది ఎలా పనిచేస్తుంది?
విప్లవాత్మకమైన భారత్ ట్యాక్సీ సేవలు జనవరి 1, 2026 నుంచి ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో ప్రారంభం కానున్నాయి. సర్జ్ ప్రైసింగ్ లేని, సున్నా కమిషన్ డ్రైవర్-యాజమాన్య సహకార ట్యాక్సీ విధానంలో ఈ యాప్ పనిచేస్తుంది. అటు ప్రయాణీకులకు, ఇటు డ్రైవర్లకు లాభదాయకంగా ఉండే విధానమే ఈ భారత్ ట్యాక్సీ.
Government-Backed, Driver-Owned: The Bharat Taxi Experiment
జనవరి 1, 2026 నుంచి ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో భారత్ ట్యాక్సీ సేవలు ప్రారంభం. ఓలా, ఉబర్, ర్యాపిడో లాంటి ప్రైవేట్ సేవలకు షాక్ ఇస్తూ భారత ప్రభుత్వం సహకార విధానంలో ప్రవేశపెట్టిన ఈ సేవలు సర్జ్ ప్రైసింగ్ లేకుండా, సున్నా కమీషన్‌తో డ్రైవర్ స్వంత సహకార ట్యాక్సీ మోడల్‌గా అమలు కానుంది.
విధాత నేషనల్ డెస్క్ | హైదరాబాద్:
Bharat Taxi | దేశంలో యాప్ ఆధారిత క్యాబ్(ట్యాక్సీ) సేవల రంగంలో కీలక మార్పుకు తెరలేపేలా భారత్ ట్యాక్సీ జనవరి 1, 2026 నుంచి ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో సేవలు ప్రారంభించనుంది. ప్రస్తుతం ఉన్న ఉబర్, ఓలా, ర్యాపిడో లాంటి సంస్థల అధిక కమిషన్ విధానాలకు ప్రత్యామ్నాయంగా, ప్రయాణీకులకే కాక, డ్రైవర్లకు కూడా ఎంతో లాభదాయకంగా ఉండేలా రూపొందించారు. ఇప్పటివరకు డ్రైవర్లపై అధిక కమీషన్ భారం మోపుతున్న ప్రైవేట్ ఆపరేటర్ల నేపథ్యంలో, ఈ కొత్త విధానం గణనీయమైన మార్పుగా భావిస్తున్నారు.
కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ పరిధిలోని సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్(Sahakar Taxi Cooperative Limited) ఆధ్వర్యంలో రూపొందిన ఈ యాప్ ఆధారిత సేవ… డ్రైవర్‌లను కేవలం భాగస్వాములుగా కాకుండా సహకార సంఘంలో భాగస్వాములుగా గుర్తించే విధానంతో ముందుకు వస్తోంది. నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ (NeGD) మద్దతుతో రూపొందిన ఈ ప్లాట్‌ఫామ్‌పై ఇప్పటికే 50 వేలమందికి పైగా డ్రైవర్‌లు నమోదు చేసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
డిసెంబర్ 2025లో ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో నిర్వహించిన STCL పైలట్ దశలో 650కు పైగా క్యాబ్‌లు, ఆటోలు, బైక్ ట్యాక్సీలు ఈ సేవల్లో భాగమయ్యాయి. పైలట్ ఫలితాల ఆధారంగా ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీ తర్వాత గుజరాత్‌లోని రాజ్‌కోట్ సహా దేశంలోని 20కిపైగా నగరాల్లో దశలవారీగా విస్తరించాలన్న ప్రణాళికలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
సర్జ్ ప్రైసింగ్‌కు చెక్… మొత్తం ఒకేరీతిన అద్దె

ప్రైవేట్ క్యాబ్ అగ్రిగేటర్లలో అమలవుతున్న సర్జ్ ప్రైసింగ్ (డిమాండ్ పెరిగినప్పుడు అద్దెను పెంచే విధానం)కు భారత్ ట్యాక్సీ పూర్తిగా భిన్నంగా ఉండనుంది. ఈ యాప్‌లో పీక్ అవర్స్‌లో, ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు(పండుగలు, సెలవు రోజులు) కూడా అద్దెలు అకస్మాత్తుగా పెంచే అద్దె పెంపు విధానం ఉండదని నిర్వాహకులు స్పష్టం చేశారు. ప్రయాణికులకు ముందే తెలిసేలా స్థిరమైన అద్దెలు అమలు చేయనున్నట్లు తెలిపారు.
డ్రైవర్లకు అధిక ఆదాయమే ఈ సహకార్ ట్యాక్సీ ‘జీరో కమీషన్’ విధానం
డ్రైవర్‌ల ఆదాయ విషయంలో కూడా భారత్ ట్యాక్సీ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి రైడ్‌పై కమీషన్ కట్టాల్సిన అవసరం లేకుండా, డ్రైవర్‌లకు 80 శాతం నుంచి 100 శాతం వరకు ఆదాయం అందేలా సున్నా కమీషన్ విధానం అమలు చేయనున్నారు. రోజువారీ తగ్గింపు(డిడక్షన్)లకు బదులుగా, నెలవారీ క్రెడిట్ సెటిల్‌మెంట్ విధానం ఉండనుంది. సభ్యత్వ రుసుము మాత్రమే డ్రైవర్‌లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో అమలవుతున్న 20–30% కమిషన్ మోడళ్లతో పోలిస్తే, ఇది డ్రైవర్ల ఆదాయంలో గణనీయమైన తేడా చూపించనుంది.
బుకింగ్ విధానం, భద్రత, సౌలభ్యాలు..అన్నీ సులభమే
భారత్ ట్యాక్సీ యాప్‌లో క్యాబ్‌లు, ఆటో రిక్షాలు, బైక్ ట్యాక్సీలను ఒకే ప్లాట్‌ఫారమ్‌లో బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. రియల్ టైమ్ జీపీఎస్ ట్రాకింగ్, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ఎస్‌ఓఎస్ బటన్, కుటుంబ సభ్యులతో లైవ్ ట్రిప్‌ను షేర్ చేసే సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఢిల్లీ వంటి నగరాల్లో స్థానిక పోలీస్ వ్యవస్థలతో అనుసంధానం చేసి భద్రతను మరింత బలోపేతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రయాణికులకు భారత్ ట్యాక్సీ అందించే ముఖ్యమైన లాభాలు ఇవి:
- సర్జ్ ప్రైసింగ్ పూర్తిగా రద్దు
- ముందే తెలిసే స్థిరమైన అద్దెలు
- క్యాబ్, ఆటో, బైక్ ట్యాక్సీ — ఒకే యాప్‌లో
- హిందీ, ఇంగ్లిష్‌తో పాటు ప్రాంతీయ భాషల మద్దతు
- రియల్ టైమ్ జీపీఎస్ ట్రాకింగ్
- కుటుంబ సభ్యులతో లైవ్ ట్రిప్ షేర్ చేసే సౌకర్యం
- 24×7 కస్టమర్ సపోర్ట్
యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లపై అందుబాటులోకి తీసుకురానున్నారు. మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్, పికప్–డ్రాప్ లొకేషన్ ఎంపిక, రైడ్ కన్ఫర్మేషన్, లైవ్ ట్రాకింగ్ వంటి ప్రయాణీకులకు అలవాటైన సాధారణ ప్రక్రియతో బుకింగ్ పూర్తి చేయవచ్చు. ఇంటర్‌సిటీ ప్రయాణాలు, మెట్రో అనుసంధాన సేవలను కూడా దశలవారీగా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నారు.

డ్రైవర్ ఆధారిత సహకార విధానంతో రూపొందిన భారత్ ట్యాక్సీ, పట్టణ రవాణా రంగంలో అద్దెల పద్ధతి, డ్రైవర్ల ఆదాయం, పారదర్శకత వంటి అంశాలపై కొత్త దృక్కోణాన్ని ఆవిష్కరించనుంది. సహకార మోడల్ ఆధారిత రవాణా సేవలకు ఇది ఒక నమూనాగా మారే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram