Chhattisgarh | కాబోయే భార్యాభ‌ర్త‌ల‌కు వింత ష‌రతు..! ఫోన్‌లో ర‌హ‌స్యంగా మాట్లాడుకోవ‌ద్దు..!!

Chhattisgarh | ఛ‌త్తీస్‌గ‌ఢ్‌( Chhattisgarh )లోని సేన్ క‌మ్యూనిటీ( Sane Community ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన వ‌ధువ‌రూలిద్ద‌రూ కూడా నిశ్చితార్థం జ‌రిగిన త‌ర్వాత పెళ్లి అయ్యే వ‌ర‌కు ఒక‌రికొక‌రు ఫోన్‌( Phone )లో ర‌హ‌స్యంగా మాట్లాడుకోవ‌ద్దు అనే వింత ష‌రతు విధించారు.

  • By: raj |    national |    Published on : Feb 22, 2026 8:23 AM IST
Chhattisgarh | కాబోయే భార్యాభ‌ర్త‌ల‌కు వింత ష‌రతు..! ఫోన్‌లో ర‌హ‌స్యంగా మాట్లాడుకోవ‌ద్దు..!!

Chhattisgarh | వివాహ బంధంలో మొట్ట‌మొద‌టి అడుగు పెళ్లిచూపులు. ఇక పెళ్లిచూపుల్లో ఒక‌రికొక‌రు న‌చ్చార‌నుకుంటే.. ఇక ముచ్చ‌టించేందుకు క్ష‌ణాల్లో ఫోన్ నంబ‌ర్ల‌ను ఇచ్చిపుచ్చుకుంటారు. ఆ క్ష‌ణం నుంచి చాట్‌లు, కాల్స్‌లో మునిగిపోతారు. ఇలా చాట్స్, కాల్స్‌లో మునిగిపోయి.. మ‌న‌స్ప‌ర్థ‌లు, అనుమానాలు, అపోహ‌ల‌తో నిశ్చితార్థానికి, పెళ్లి ముందే విడిపోతున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని సేన్ క‌మ్యూనిటీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన వ‌ధువ‌రూలిద్ద‌రూ కూడా నిశ్చితార్థం జ‌రిగిన త‌ర్వాత పెళ్లి అయ్యే వ‌ర‌కు ఒక‌రికొక‌రు ఫోన్‌లో ర‌హ‌స్యంగా మాట్లాడుకోవ‌ద్దు అనే వింత ష‌రతు విధించారు. మొత్తంగా ఇరువురు ఫోన్ కాల్స్ మాట్లాడుకోవ‌డంపై నిషేధం విధించారు.

ర‌హ‌స్యంగా మాట్లాడుకోవ‌ద్దు..

పెళ్లి సంబంధాలు కుదిరిన త‌ర్వాత కాబోయే భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ త‌రుచుగా ఫోన్లు మాట్లాడుకోవ‌డం వ‌ల్ల మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్తి విడిపోయిన‌ట్లు సేన్ క‌మ్యూనిటీ గుర్తించింది. వారి సామాజిక వ‌ర్గంలోనూ ఇలాంటి సంఘ‌ట‌న‌లు వెలుగు చూశాయి. ఈ క్ర‌మంలో సేన్ కమ్యూనిటీ క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంది. నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్లి వరకు తమకు కాబోయే భాగస్వామితో వధూవరులిద్దరూ రహస్యంగా ఫోన్‌లో మాట్లాడకూడదని నిర్ణయించింది. కాబోయే భర్త లేదా భార్యతో కుటుంబ సభ్యుల సమక్షంలో మాట్లాడొచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు సేన్ కమ్యూనిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.

అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నాం..

ఈ సంద‌ర్భంగా సేన్ క‌మ్యూనిటీ బ‌రోద్ జిల్లా అధ్య‌క్షుడు సంతోష్ కౌశిక్ మాట్లాడుతూ.. ఈ టెక్నాల‌జీ యుగంలో మ‌రి ముఖ్యంగా మొబైల్ ఫోన్లు కుటుంబాల‌ను విచ్చిన్నం చేస్తున్నాయ‌ని పేర్కొన్నారు. పెళ్లిచూపులు కుదిరాక‌, నిశ్చితార్థం జ‌రిగిన త‌ర్వాత‌.. వ‌ధూవ‌రులిద్ద‌రూ ఫోన్లో ర‌హ‌స్యంగా మాట్లాడుకోవ‌డం వ‌ల్ల త‌మ క‌మ్యూనిటీలో చాలా జంట‌లు పెళ్లికి ముందే విడిపోయాయ‌ని తెలిపారు. ఫోన్‌లో గంట‌ల త‌ర‌బ‌డి మాట్లాడ‌డం వ‌ల్ల కుటుంబ సంబంధాలు కూడా దెబ్బ‌తింటున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అందుకే నిశ్చితార్థం అయిన తర్వాత వివాహం వరకు కాబోయే వధూవరులిద్దరూ ఫోన్‌లో రహస్యంగా మాట్లాడకూడదని నిర్ణయించామని తెలిపారు.

ప్రీవెడ్డింగ్ షూట్‌లపై బ్యాన్

ఇటీవలే ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సాహు సమాజ్ తమ సామాజిక వర్గంలో ప్రీవెడ్డింగ్ షూట్‌లను పూర్తిగా నిషేధించింది. ఇది మన సంప్రదాయాలకు విరుద్ధమని, పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరించడం వల్ల మన మూలాలు దెబ్బతింటున్నాయని స్పష్టం చేసింది. పెళ్లి అనేది పవిత్రమైన బంధమని, దానిని సెలబ్రిటీ షోలా మార్చడం సరైనది కాదని పేర్కొంది.