Honeymoon | హనీమూన్ అంటే కొత్తగా పెళ్లయిన జంట ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలను సృష్టించుకునే ప్రత్యేక సమయం. కానీ ఓ కొత్త పెళ్లికొడుకు మాత్రం ఆ అందమైన క్షణాలను కాస్త ఫ్యామిలీ ట్రిప్‌గా మార్చేశాడు. భర్తతో ఏకాంతంగా గడపవచ్చని ఆశపడితే హనీమూన్‌కు భర్త తన తల్లిదండ్రులు, సోదరుడు, సోదరిని వెంటబెట్టుకురావడంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ఇంకేముంది హనీమూన్ నుంచి వచ్చిరాగానే విడాకులు కావాలని కోర్టు మెట్లెక్కింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. మీరట్ జిల్లాలోని రామ్‌రాజ్ ప్రాంతానికి చెందిన ఓ యువతికి ఢిల్లీలోని పటేల్ నగర్‌కు చెందిన యువకుడితో ఇటీవల వివాహమైంది. మ్యాట్రిమోనల్ వెబ్‌సైట్ ద్వారా వీరి పెళ్లి కుదిరింది. యువతి గ్రాడ్యుయేట్ కాగా.. యువకుడు సింగపూర్‌లో హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ చదివాడు. పెళ్లి అనంతరం ఇద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని ఇరు కుటుంబాలు ఆశించాయి. కానీ హానీమూన్‌తోనే నూతన దంపతులు విడిపోవాల్సిన పరిస్థితి వస్తుందని మాత్రం వాళ్లు ఊహించలేదు.
పెళ్లి తర్వాత కొత్త జంట హనీమూన్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ ట్రిప్‌లో భర్తతో దొరికే ఏకాంత సమయంలో అతడిని పూర్తిగా అర్థం చేసుకోవాలని యువతి ఆశపడింది. కానీ ఆమెకు భర్త ఊహించని షాకిచ్చాడు. హనీమూన్‌కు తన తల్లిదండ్రులు, సోదరి, సోదరుడిని కూడా తీసుకొచ్చాడు. అలా హనీమూన్ కాస్త ఫ్యామిలీ ట్రిప్‌గా మారడంతో సదరు యువతికి . పెళ్లి తర్వాత హ్యాపీగా ఎంజాయ్ చేసే ఈ ట్రిప్‌లో తన భర్త ఫ్యామిలీని తీసుకురావడంతో అసలు ఏకాంతంగా గడిపే అవకాశమే దొరకలేదని వాపోయింది. ఇదే విషయంలో నవ దంపతుల మధ్య చిన్న చిన్న వాగ్వాదాలు జరిగాయి. క్రమంగా అవి పెద్దగా మారాయి. ఇంకేముంది హనీమూన్ నుంచి వచ్చి రాగానే విడాకులు కావాలని పట్టుబట్టింది. వచ్చిరాగానే కోర్టును ఆశ్రయించింది. జరిగినదంతా కౌన్సిలర్ల ముందు యువతి చెప్పుకుంది.
మరోవైపు భర్త మాత్రం తన చర్యను సమర్థించుకున్నాడు. తాను ఏ తప్పు చేయలేదని.. కుటుంబసభ్యులందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే వారిని తన వెంట తీసుకెళ్లానని తెలిపాడు. భార్యను అప్‌సెట్ చేసే ఉద్దేశం తనకు ఎంత మాత్రం లేదని కౌన్సిర్లకు వివరించారు. ఇప్పటివరకు ఈ జంటకు మూడు ధఫాలుగా కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ.. సమస్యకు పరిష్కారం కనిపించలేదు. తాజాగా మరోసారి ఇద్దరితో ప్రత్యేకంగా మాట్లాడిన కౌన్సిలర్లు కొంత సమయం తీసుకుని భవిష్యత్తుపై ఆలోచించుకోవాలని సూచించారు. అయినప్పటికీ వారిద్దరి మధ్య అభిప్రాయబేధాలు తగ్గకపోవడంతో వివాహబంధం సంక్షోభంలోపడింది. ఇకపై వారు రాజీకి రాకపోతే విడాకుల దిశగానే వెళ్లాల్సి ఉంటుందని తెలుస్తోంది.